ముకరంపుర/జగిత్యాల/ధర్మారం : రేషన్ కార్డుల స్థానంలో ఆహారభద్రత కార్డులు జారీ చేస్తామని, ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తామని గొప్పగా ప్రకటించిన ప్రభుత్వం ఆ భారాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలని చూస్తోంది. ఇటీవల ఆహార భద్రత కార్డులకు అందిన దరఖాస్తుల్లో 76 శాతం మంది అర్హులుగా తేలండంతో సర్కారు కొత్త ఎత్తుగడ వేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 60శాతం మందిని, పట్టణ ప్రాంతాల్లో 40శాతం మందికే కార్డులు జారీ చేయాలని మౌఖికంగా ఆదేశాలిచ్చింది. దీంతో తమ కార్డు ఉంటుందో.. ఊడుతుందోనని జనం అభధ్రకు గురవుతున్నారు.
ఉదాహరణకు ధర్మారం మండలంలో ఆహార భద్రత కార్డుల కోసం 18,189 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 14,354మందిని అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. గతంలో మండలంలో 15,795 మందికి తెల్లరేషన్‌కార్డులు ఉండగా, అందులో నుంచి 1441 కార్డులకు కోత పడనున్నట్లు తెలిసింది. ఇలా సాధ్యమైనంత వరకు కోతలు విధించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయినట్లు రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. ఇప్పటికే పలుమార్లు విచారణ చేసి జాబితాను తయారుచేయగా మళ్లీ కుదించడం తమవల్ల మదనపడుతున్నారు. మరోవైపు గ్రామాల్లో అనర్హులకు కార్డులు జారీకావడం లేదని ప్రచారం జరగడంతో రెవెన్యూ సిబ్బందిపై రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి పెరిగింది. సర్పంచులు, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధుల నుంచి కూడా ‘ఫలానా వారిని గుర్తించండి’ అంటూ ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది.
కొత్త సంవత్సరం కానుగా..
ఫిబ్రవరి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండటంతో 2015కొత్త సంవత్సరం కానుకగా జనవరి నుంచే ఆహార భద్రత పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25వరకు గుర్తించి లబ్దిదారులకు జనవరి ఒకటి నుంచే రేషన్ సరుకులు అందించేందుకు ఉపక్రమించింది. ఆహార భద్రత కార్డుల జారీకి ఇంకా స్పష్టమైన ఆదేశాలు రానప్పటికీ కీ రిజిస్టర్ ప్రామాణికంగా బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేయాలని అధికారయంత్రాంగాన్ని ఆదేశించింది.
ఈక్రమంలో బుధవారమే డీడీలు చెల్లించాలని డీలర్లకు అధికారులు సూచించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 2080 మంది రేషన్‌డీటర్లు డీడీలు చెల్లించి సంబంధిత తహశీల్దార్దకు అందజేశారు. సాధారణంగా రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి లబ్దిదారుల వివరాలను కీ రిజిస్టర్‌లో పొందుపర్చిన అనంతరం ఆ మేరకు రేషన్ కోటా విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ 20 తేదీలోపు పూర్తవుతుంది. ఈసారి కీ రిజిస్టర్ల తయారీని 25వరకు పొడిగించారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసేలా పాత కోటా పెంచుతూ డీలర్లతో డీడీలు కట్టించుకున్నారు.
11,57,053 దరఖాస్తులు
జిల్లాలో 12,35,810 కుటుంబాలుండగా, ఆహారభద్రత కార్డుల కోసం 11,57,053 దరఖాస్తులు వచ్చాయి. అందులో గ్రామీణ ప్రాంతాల నుంచి 9,34,934, నగర, పట్టణ ప్రాంతాల నుంచి 2,22,119 దరఖాస్తులు అందాయి. బోగస్ కార్డులను తొలగించాలనే కఠినమైన ఆదేశాలున్న నేపథ్యంలో అధికారులు ఇల్లిల్లు తిరిగి దరఖాస్తులను పరిశీలించారు. ప్రస్తుతం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది.
ఇప్పటివరకు 8.99 లక్షల దరఖాస్తులను ఆన్‌లైన్ చేయగా, వాటిని తహశీల్దార్లు పునఃపరిశీలన జరుపుతున్నారు. ఇప్పటివరకు 7లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. మిగిలిన 2.57లక్షల దరఖాస్తులను ఆన్‌లైన్ నమోదు చేయాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తికానుంది. అనంతరం గ్రామసభలు ఏర్పాటు చేసి అర్హులు, అనర్హుల జాబితాను ప్రకటించనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. జాబితాలో లేనివారికి కారణాలు తెలియజేసి, అవసరమైన వారి నుంచి మళ్లీ అర్జీలు స్వీకరించి తుది జాబితాను ఖారారు చేస్తారు. అయితే కుటుంబంలోని మహిళ పేరున ఆహార భద్రత కార్డును అందజేయాలని సర్కారు నిర్ణయించింది. అర్హులకు తాత్కాలిక కార్డులిస్తారా.. ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్‌కార్డు రూపంలో కార్డులు జారీ చేస్తారా.. అనే విషయంపై స్పష్టత లేదు.
ఆరుకిలోల చొప్పున పంపిణీ
జిల్లాలో గతంలో 11,88,974 రేషన్‌కార్డులుండేవి. ఇందులో గులాబీకార్డులు 99,806కాగా, 10,89,168 తెల్లకార్డులు. ప్రస్తుతం తెల్లకార్డు గల కుటుంబాల్లో ఒక్కో వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున గరిష్టంగా 20 కిలోలిస్తున్నారు. ఏఏవై కార్డున్న కుటుంబానికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డున్న కుటుంబానికి పది కిలోలుఅందజేస్తున్నారు. జిల్లాలో ప్రతినెలా 16,159,528 టన్నులు పంపిణీ చేస్తున్నారు.
ఆహారభద్రత పథకంలో కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని గరిష్ట పరిమితి లేకుండా అందజేయనున్నారు. గులాబీ కార్డుల సైతం రేషన్ బియ్యం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీంతో అదనంగా 25వేల టన్నులకు పైగా బియ్యం అవసరముంటుందని అధికారులు చెబుతున్నారు.
ఆహార అభద్రత!
Published Thu, Dec 25 2014 1:00 AM | Last Updated on Thu, Oct 4 2018 5:08 PM
Advertisement
Advertisement