ఇక.. ‘ఆహార భద్రత’ | Food Safety Cards in telangana | Sakshi
Sakshi News home page

ఇక.. ‘ఆహార భద్రత’

Published Fri, Oct 10 2014 2:56 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM

ఇక.. ‘ఆహార భద్రత’ - Sakshi

ఇక.. ‘ఆహార భద్రత’

 దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్..
 దరఖాస్తుల స్వీకరణ : నేటి నుంచి ఈనెల 15 వరకు
 దరఖాస్తుల పరిశీలన : 16 నుంచి 25వ తేదీ వరకు
 అర్హుల జాబితా తయారీ : 26 నుంచి 29వ తేదీ వరకు
 ప్రభుత్వానికి జాబితా సమర్పణ : ఈ నెలాఖరు వరకు

 
 నీలగిరి : ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డులను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించింది. ఇదే క్రమంలో వృద్ధాప్య, వికలాంగుల పింఛన్లు రద్దు చేసి వాటి స్థానంలో కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు కార్యాచరణ సిద్ధమైంది. రేషన్‌కార్డులు, పింఛన్‌దారులు, ఫాస్ట్ పథకం కింద లబ్ధిపొందాలను కుంటున్న విద్యార్థులు సైతం మళ్లీ కొత్తగా ధ్రువీకరణ పత్రాలు పొందాల్సి ఉంటుంది. పాత వాటిని రద్దు చేసి కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం షెడ్యూల్ జారీ చేసింది. ఆహారభద్రత కార్డులు, పింఛన్ల కోసం శుక్రవారం నుంచి ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
 
 సమగ్ర సర్వే వివరాలే ప్రామాణికంగా..
 జిల్లాలో ప్రస్తుతం 9,31,525 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటిన్నింటినీ రద్దు చేసి వాటి స్థానంలో తెలగాణ ప్రభుత్వం ‘ఆహార భద్రత’ పేరిట కొత్త కార్డులు జారీ చేస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8.75 లక్షల జనాభా ఉంది. అయితే ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో జనాభా 11.50 లక్షలకు పెరిగింది. 2.75 లక్షల కుటుంబాలు పెరిగాయి. సర్వే వివరాలను ప్రామాణికంగా తీసుకుని కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి 4 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. అది కూడా కుటుంబంలో ఐదుగురు సభ్యులకు 20కిలోల వరకు మాత్రమే పరిమితం చేశారు. కానీ కొత్త కార్డులు జారీ చేసిన తర్వాత ఆహార భద్రత చట్టం కింద ఒక్కో వ్యక్తికి 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు. కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉంటే అంతమందికి 5 కేజీల చొప్పున ఇస్తారు. సీలింగ్ అనేది ఉండదు.
 
 నవంబర్ 1నుంచి పెరగనున్న పింఛన్లు
 వృద్ధాప్య, వికలాంగుల పింఛన్లు నవంబర్ 1 నుంచి పెరగనున్నాయి. జిల్లాలో అన్ని కేటగిరీల్లో కలుపుకుని మొత్తం పింఛన్‌దారులు 3లక్షల 94 వేల మంది వరకు ఉన్నారు. దీంట్లో ప్రస్తుతం వృద్ధులకు రూ.200, వికలాంగులకు రూ.500 పంపిణీ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు రూ. వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పెరుగుదల నవంబర్ ఒకటి నుంచి అమలు చేస్తారు. వృద్ధుల పింఛన్ వయో పరిమితిలో ఎలాంటి మార్పులేదు. కానీ జిల్లాలో 8 వేల మంది వికలాంగులకు సదరమ్ సర్టిఫికెట్లు లేవు. వీరి కోసం ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలో యుద్ధప్రాతిపదికన సదరమ్ క్యాంపులు నిర్వహిస్తామని డీఆర్‌డీఏ పీడీ చిర్రా సుధాకర్ తెలిపారు. పింఛన్ల పెంపును కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులకు కూడా వర్తిస్తుందా? లేదా? అన్నది ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. అయినా గానీ ఈ లబ్ధిదారులు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 
 విద్యార్థులకు తప్పని తిప్పలు...
 తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయ (ఫాస్ట్) పథకం కింద లబ్ధిపొందాలనుకుంటున్న విద్యార్థులు మళ్లీ ఆదాయ, స్థానిక, కుల ధ్రువీకరణ పత్రాలను పొందాలి.  ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద జిల్లాలో సుమారు లక్షకు పైగా విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. వీరంతా అడ్మిషన్ సమయంలో జతపర్చిన సర్టిఫికెట్లు కాకుండా మళ్లీ కొత్తగా పొందాల్సి ఉంటుంది. త్వరలో ఫాస్ట్ పథకం దరఖాస్తులు ఆన్‌లైన్‌లో తీసుకుంటారు. కాబట్టి విద్యార్థులు సర్టిఫికెట్లు పొందాల్సి ఉంది. అదీగాక గతంలో మీ సేవ కేంద్రాల నుంచి సర్టిఫికెట్లు పొందారు. కానీ ప్రస్తుతం తహసీల్దార్ల నుంచే స్వయంగా పొందాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఏదిఏమైనప్పటికీ ఏకకాలంలో ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఇప్పుడు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
 
 దరఖాస్తులు ఎక్కడ చేసుకోవాలంటే..
 విద్యార్థులు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ సేవ కేంద్రాల్లో ఇవ్వరు.
 రేషన్ కార్డులు, పింఛన్ల కోసం గ్రామ స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి.
 గ్రామ స్థాయిలో దరఖాస్తులు స్వీకరించే బాధ్యతను వీఆర్వో, వీఆర్‌ఏ, వ్యవసాయ శాఖ ఉద్యోగులు, అంగన్‌వాడీ వర్కర్లు, విద్య, వైద్య శాఖలకు చెందిన సిబ్బందికి అప్పగించారు.
 ప్రస్తుతం వీఆర్వోలు రైతురుణ మాఫీ పథకానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉన్నందున వారి స్థానంలో ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.
 
 పథకాలకు అర్హులు..

 వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు కలిగిన గ్రామీణ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు.
 వార్షిక ఆదాయం రూ.2.00 లక్షలు కలిగిన అర్బన్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు.
 అనర్హులు..
 5 ఎకరాలు మెట్ట లేదా 2.50 ఎకరాల మాగాణి భూములు కలిగిన వారు .
 ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు .
 ప్రభుత్వ సహాయం పొందకుండా (ఇందిరమ్మ ఇళ్లు) 3గదుల పక్కా ఇల్లు ఉన్న వారు.
 
 లబ్ధిదారుల ఎంపిక ఇలా...
 ఈ నెల 15న దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది. అదే రోజు సాయంత్రం వాటిన్నింటినీ మండలాలకు పంపిస్తారు. వచ్చిన దరఖాస్తులను 16వ తేదీ నుంచి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. దీని కోసం ఒక్కో మండలానికి ప్రత్యేకంగా 5బృందాలను (టీమ్స్) నియమించారు. లబ్ధి దారుల ఎంపిక బాధ్యత మొత్తం కూడా రెవెన్యూ శాఖకు అప్పగించారు. ఈబృందంలో  డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, మరో ఇద్దరు సభ్యులు ఉంటారు. వచ్చిన దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాలను, సమగ్ర కుటుంబ సర్వే డేటా వివ రాలను పోల్చి చూస్తారు. ప్రస్తుతం సర్వే డేటాను అన్ని మండలాలకు పంపిస్తున్నారు. దీంతో పాటు వచ్చిన దరఖాస్తుల్లో ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే వాటిని క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆరాతీస్తారు. అనర్హత కలిగిన దరఖాస్తులు ఉన్నట్లయితే వాటిని తొలగిస్తారు. తప్పుడు దరఖాస్తులను కూడా అధికారులు ఆమోదించినట్లయితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement