
అడుగుకో అగ్నిగుండం
- జీహెచ్‌ఎంసీ ‘ఫైర్’
- వెబ్‌సైట్‌లో సంస్థల వివరాలు
- ఎట్టకేలకు కదులుతున్న యంత్రాంగం
సాక్షి, సిటీ బ్యూరో: గ్యాస్ సిలిండర్లు పేలడం.. రోడ్లు కుంగడమే కాదు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎక్కడికెళ్లినా ఏదో రూపంలో ముప్పు పొంచి ఉంటోంది. పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లతో పాటు ఇంజినీరింగ్ విద్యా సంస్థల నుంచి మల్టీప్లెక్స్‌ల దాకా ఎక్కడా భద్రత లేదు. పొరపాటున అగ్ని ప్రమాదం వంటివి జరిగితే తప్పించుకునేందుకు తక్షణ ఏర్పాట్లు లేవు. కనీస రక్షణ చర్యలు అంతకన్నా లేవు. చివరకు ప్రాణాపాయంలో ఆస్పత్రులకు వెళ్తే అక్కడ కూడా గ్యారెంటీ లేదు.
గ్రేటర్‌లోని అనేక ఆస్పత్రులకు కనీస ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేవు. సాధారణ స్థాయి నుంచి భారీ వ్యాపారాలతో రూ.కోట్లు ఆర్జిస్తూ పేరొందిన సంస్థల వరకూ అన్నిటిదీ ఇదే వరుస. పెళ్లిళ్లు, ఇతరత్రా ఫంక్షన్లు నిర్వహించుకునే హాళ్లు, కల్యాణ మండపాల్లో సైతం అగ్ని ప్రమాదాల బారి నుంచి తప్పించుకునేందుకు సేఫ్టీ ఏర్పాట్లంటూ లేవు. సాధారణ ప్రజల నుంచి సైతం ఆస్తిపన్ను, ట్రేడ్ లెసైన్సుల ఫీజుల వంటి వాటిపై శ్రద్ధ చూపే జీహెచ్‌ఎంసీ.. ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న వాటిపై ఇంతవరకు దృష్టి సారించలేదు.
గతంలో పార్క్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు.. పొరుగు రాష్ట్రంలో అగ్నికీలలు ఎగసి పడినప్పుడు హడావుడి చర్యలకు సిద్ధమైనప్పటికీ ఆ తర్వాత మరచిపోయింది. ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేని ఆస్పత్రుల లెసైన్సులు రద్దు చేస్తామని భారీ ప్రకటనలే గుప్పించింది. అగ్నిమాపక విభాగం నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్‌ఓసీ) తప్పనిసరి అని పేర్కొంది. కానీ క్రమేపీ ఆ విషయాన్ని మరచిపోయింది. దీంతో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు చేస్తున్న వారు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉంటున్నారు.
చదువుకునేందుకు విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థుల నుంచి పెళ్లిళ్లకు ఫంక్షన్ హాళ్లకు వెళ్లే వారి దాకా అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ముషీరాబాద్‌లో కలప దుకాణంలో అగ్ని ప్ర మాదం జరిగినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడం చూసిన జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ శ్చర్యపోయారు. ప్యారడైజ్ హోటల్‌లో నూ ఏర్పాట్లు లేకపోవడంపై నోరెళ్లబెట్టారు. ఎట్టకేల కు ఇక ‘సేఫ్టీ లేని సంస్థలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేని సంస్థల వివరాలు సేకరించి ప్రజలకు తెలిసేలా వెబ్‌సైట్‌లో పెట్టాలన్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సూచన మేరకు సంబంధిత అ ధికారులు ఆ పనుల్లో మునిగారు.
ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలతో పాటు ఆస్పత్రులు, ఫంక్షన్ హాళ్లలో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేనివి గుర్తించారు. ఆవివరాలను జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ‘వీటిల్లో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేవు.. ఇక అక్కడ మీ పిల్లలను చదివించాలో లేదో మీరే అంచనా వేసుకోండి’ అని సూచిస్తున్నారు. చిన్నస్కూళ్ల నుంచి రూ.లక్షల్లో ఫీజులు గుంజే సంస్థలు సైతం వీ టిలో ఉన్నాయి. ఏయే సంస్థలకు ఈ ఏర్పాట్లు లేవో ఆ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
కఠిన చర్యలు చేపడతాం...
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంస్థలను చూస్తూ ఊరుకునేది లేదని జీహెచ్‌ఎంసీ ఫైర్‌సేఫ్టీ విభాగం అడిషనల్ డెరైక్టర్ పి.వెంకటరమణ హెచ్చరించారు. ఇందులో భాగంగా పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీఈఓలకు, కళాశాలలపై చర్యలకు కళాశాల విద్య కమిషనర్‌కు, ఆస్పత్రులపై చర్యలకు జిల్లాల వైద్యాధికారులకు లేఖలు రాశామన్నారు. ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేని వాటికి అనుమతులు రద్దు చేయాల్సిందిగా కోరామన్నారు. వారు స్పందించని పక్షంలో ఫైర్‌సేఫ్టీ చట్టం మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మలిదశలో హోటళ్లు, మల్లీప్లెక్స్‌లు తదితర జనసమ్మర్థం ఎక్కువగా ఉండే సంస్థల సర్వే నిర్వహించి, వాటి వివరాలూ వెబ్‌సైట్‌లో పెడతామన్నారు. జీహెచ్‌ంఎసీ వెబ్‌సైట్లోని వివరాల మేరకు 946 ఆస్పత్రులు, 634 ఫంక్షన్ హాళ్లు, 178 ఇంజినీరింగ్ కళాశాలలకు ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేవు. విద్యాసంస్థలూ వేల సంఖ్యలో ఉన్నాయి.