సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఖరీఫ్ ముంచుకొస్తున్న తరుణంలో రుణమాఫీ రైతులకు ఆశలూరిస్తోంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. జూన్ 2న ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనుండటంతో... తెలంగాణలో కొలువుదీరే తొలి ప్రభుత్వం అమలు చేసే రుణమాఫీ విధానం ఎలా ఉంటుంది? గత ఏడాది రైతులు తీసుకున్న పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయా?
పాత బకాయిలు కూడా మాఫీ అవుతాయా? బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులకు ఈ విధానం వర్తిస్తుందా? వ్యవసాయ అనుబంధ రుణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారా? కేవలం రూ.లక్ష లోపు రుణం తీసుకున్న వారినే అర్హులుగా పరిగణిస్తారా? ఎంత ఎక్కువ మొత్తం రుణ బకాయిలు ఉన్నా సరే.. అందులో రూ.లక్ష మాఫీ చేస్తారా? ఈ వరుస సందేహాలన్నీ ఇటు రైతులను.. అటు బ్యాంకర్లను వెంటాడుతున్నాయి.
మరోవైపు పాత రుణాలు మాఫీ చేస్తే తప్ప కొత్తగా పంట రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఖరీఫ్‌లో పెట్టుబడులు సమకూర్చుకునేందుకు తిప్పలుపడుతున్న రైతులు కొత్త రుణాలకు బ్యాంకులను ఆశ్రయించేందుకు వెనుకా ముందాడుతున్నారు. వాణిజ్య బ్యాంకులతో పాటు సహకార బ్యాంకులన్నీ కలిపి జిల్లాలో మొత్తం 386 బ్యాంకు బ్రాంచీలున్నాయి.
వీటి పరిధిలో మొత్తం 4,77,663 మంది రైతులు గత ఏడాది పంట రుణాలు తీసుకున్నారు. మార్చి 31 నాటికి జిల్లాలోని బ్యాంకుల్లో రైతుల పేరిట ఉన్న పంట రుణాల మొత్తం రూ.2,700 కోట్లు. 2013-14 సంవత్సర కాలంలో పంపిణీ చేసిన పంట రుణాల మొత్తం రూ.1,800 కోట్లు. మిగతా రూ.900 కోట్లు అంతకుముందు తీసుకున్న పంట రుణాల బకాయిలు. పంట రుణాలే కాకుండా వ్యవసాయ పరికరాలు, ఆధునిక పరికరాలు, ట్రాక్టర్లు, అనుబంధ యూనిట్ల పేరిట జిల్లాలో మరో రూ.1,422 కోట్ల వ్యవసాయ సంబంధిత రుణాలు (టర్మ్ లోన్స్) పంపిణీ అయ్యాయి. 1,09,714 మంది రైతులు ఈ రుణాలు తీసుకున్నారు. వీటిలో రూ.51 కోట్లు పాత బకాయిలున్నాయి.
జిల్లాలోని బ్యాంకుల్లో దాదాపు రూ.284 కోట్ల విలువైన బంగారం తాకట్టులో ఉంది. వ్యవసాయంతో పాటు సొంత అవసరాలకు దాదాపు 28,083 మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. గత ఏడాది బంగారంపై పంపిణీ చేసిన రుణాల విలువ రూ.70 కోట్లుగా బ్యాంకర్ల నివేదికలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా జిల్లాలో రూ.4122 కోట్ల రుణాలు రైతుల పేరిట బ్యాంకుల్లో బకాయిలున్నాయి. రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు వెలువడితే తప్ప ఇందులో ఎంత రుణం మాఫీ అవుతుంది.. ఎంత మంది రైతులు లబ్ధి పొందుతారనేది చెప్పలేమని లీడ్‌బ్యాంక్ మేనేజర్ చౌదరి అభిప్రాయపడ్డారు. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలోనే బ్యాంకర్లు వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేస్తారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో.. కలెక్టర్ సూచన మేరకు ఈ కార్యక్రమం వాయిదా పడింది. కోడ్ తొలిగిపోవటంతో జూన్ 2న వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేసేందుకు లీడ్‌బ్యాంక్ సన్నద్ధమైంది.
ఊరిస్తున్న రుణ మాఫీ
Published Fri, May 30 2014 2:01 AM | Last Updated on Wed, Aug 15 2018 7:50 PM
Advertisement
Advertisement