సాక్షి, సిటీబ్యూరో: కెనడా వెళ్లి ఉద్యోగం చేయాలనే నగర వైద్యుడి కలను సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకున్నారు. అక్కడి దరమ్ ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చిందని నమ్మించడమేగాక, వివిధ సర్టిఫికెట్ల పేరుతో రూ.9.55 లక్షలు గుంజారు. ఆ సర్టిఫికెట్లను పంపడానికి, వాటిని ఇన్సూరెన్స్ అవసరమని చెప్పడంతో డాక్టర్‌కు అనుమానం వచ్చింది. ఆరా తీయగా... మోసపోయానని గుర్తించిన అతను శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. మలక్‌పేట ప్రాంతానికి చెందిన వైద్యుడు అమీర్‌కు కెనడాలో ఉద్యోగం చేయాలని ఆకాంక్ష.
దీనికోసం ఆయన క్రోయిజ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అనే ఆన్‌లైన్ సైట్‌లో రిజిస్టర్ చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు కెరియర్.డీజీహెచ్ ఎట్ జీమెయిల్.కామ్ అనే ఐడీ నుంచి ఓ ఈ–మెయిల్ వచ్చింది. డీసీఏ పైపర్ల అనే ఏజెన్సీకి చెందిన స్ట్రాంట్లీ అనే వ్యక్తి పంపినట్లుగా వచ్చిన ఆ మెయిల్‌లో... తమ వద్ద కొన్ని ఉద్యోగాలు ఉన్నాయని, బయోడేటా పంపాల్సిందిగా కోరడంతో అమీర్ తా పనిచేశారు. ఆపై మీ అర్హతల నేపథ్యంలో మీకు కెనడాలో ఉన్న దరమ్ ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చిందంటూ మరో సందేశం పంపారు. ఈసారి మెయిల్ కెరియర్స్ దరమ్ ఎట్ జీమెయిల్.కామ్ అనే ఐడీ నుంచి రావడంతో తనకు ఉద్యోగం వచ్చినట్లు అమీర్ నమ్మాడు.
వివిధ సర్టిఫికెట్లు అవసరమంటూ...
కెనడాలో ఉద్యోగంలో చేయడానికి కొన్ని సర్టిఫికెట్లు అవసరమవుతాయంటూ సైబర్ నేరగాళ్లు ఎర వేశారు. ప్రాసెసింగ్ ఫీజ్, వీసా ఫీజ్, ఏజెన్సీ సర్టిఫికేషన్, పోలీస్ క్లియరెన్స్ డాక్యుమెంట్, కెనడా ఆర్థిక విభాగం నుంచి ఫండ్ రిలీజ్ ఆర్డర్, కెనడాకు చెందిన జస్టిస్ డిపార్ట్‌మెంట్ నుంచి యాంటీ మనీలాండరింగ్ క్లీన్‌చిట్ సర్టిఫికెట్... ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుందంటూ ఫీజులుగా రూ.9.55 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. ఆపై ఉద్యోగం ఖరారైందని త్వరలోనే వచ్చి చేరవచ్చంటూ సందేశం ఇచ్చారు. ఈలోపు ఆయా సర్టిఫికెట్లు తనకు పంపాలంటూ అమీర్ కోరారు.
దీనికి సైబర్ నేరగాళ్ల నుంచి ఓ చిత్రమైన సమాధానం వచ్చింది. ఆయా ధృవీకరణ పత్రాలన్నీ అత్యంత రహస్యమై, విలువైనవనవని, వాటిని కొరియర్ ద్వారా పంపడానికి ఇన్సూరెన్స్ చేయించాలంటూ మరోసారి డబ్బు గుంజడానికి ఎత్తు వేశారు. బీమా, కొరియర్ చార్జీలకు మరో రూ.3.99 లక్షలు డిపాజిట్ చేయమని చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన అమీర్ కెనడాలోని దరమ్ ఆస్పత్రిని సంప్రదించగా, తాను మోసపోయినట్లు తెలుసుకున్నాడు. దీంతో శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment