తన ఆటోతో సంజయ్...
బంజారాహిల్స్: ప్రార్ధించే పెదవులకన్నా...సాయం చేసే చేతులు మిన్న అనే భావనతో ఓ ఆటోడ్రైవర్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తినిస్తున్నాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ అభాగ్యులకు నేనున్నానంటూ భరోసానిస్తున్నాడు. ఆ ఆటో డ్రైవర్ పేరు మ్యాదరి సంజయ్. బోరబండ నివాసి. చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోయాడు. కూలీపనిచేస్తూ జీవనం సాగించేవాడు. తరువాత పెళ్లి చేసుకొని బోరబండలో నివాసం ఉంటున్నాడు. 2010 నవంబర్‌లో ఓ రోజు అర్ధరాత్రి గర్భంతో ఉన్న తన భార్యకు నొప్పులు అధికమయ్యాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటో కోసం చాలా తిరిగాడు. ఇంత రాత్రివేళ మేము ఆస్పత్రికి రాలేం అని చాలామంది చెప్పారు. చివరకు ఓ పెద్దాయన రిక్షా ఇచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లమన్నాడు.
అంతరాత్రి స్వయంగా రిక్షాలో భార్యను నీలోఫర్‌కు తీసుకెళ్లాడు. ఎట్టకేలకు ఆపద నుంచి బయటపడ్డాడు. ఆ సంఘటన సంజయ్ మనసులో నాటుకుపోయింది. సకాలంలో ఆస్పత్రికి చేరలేకపోతే పరిస్థితి ఎలా ఉండేదోనన్న ప్రశ్న అతనిని వెంటాడింది. అప్పటినుంచి సెంట్రింగ్ పనులు చేశాడు. ఎలాగైనా ఆటోకొని గర్భిణులు, వృద్ధులు, వికలాంగులకు సేవలందించాలనే సంకల్పంతో డబ్బు సంపాదించాడు. 2013 డిసెంబర్‌లో ఓ ఆటోను కొనుగోలు చేశాడు. అప్పటినుంచీ ఆటో నడుపుతూ గర్భిణీలకు, వృద్ధులు, వికలాంగులకు ఉచితంగా ఆస్పత్రికి చేరుస్తున్నాడు. దాదాపు 260 మందిని ఆటోలో ఉచితంగా ఆస్పత్రులకు తీసుకెళ్లి సేవాతత్పరతను చాటుకున్నాడు. తన ఆటో వెనుకాల గర్భిణీలకు, వృద్ధులు, వికలాంగులకు ఎమర్జెన్సీ ఫ్రీ అని కూడా రాశాడు.
Comments
Please login to add a commentAdd a comment