
సాక్షి, సిటీబ్యూరో: భానుడి ప్రతాపానికి శుక్రవారం సిటీజన్లకు ‘ఫ్రై’ డేను తలపించింది. గరిష్ఠంగా 40.7 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. సాధారణం కంటే 2 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. పగటి వేళ భానుడు ప్రతాపం చూపినప్పటికీ.. ఉపరితల ద్రోణి ప్రభావంతో సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30– 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. రానున్న 24 గంటల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా.. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు పెరగడంతో నగరంలో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వినియోగం పెరిగింది. దీంతో కరెంట్ వినియోగం సైతం అనూహ్యంగా పెరిగింది.
ఎండా.. ఠండా..
నగరంలో మధ్యాహ్నం వేళ ఎండ.. సాయంత్రం వేళ ఠండా వాతావరణం విభిన్న వాతావరణ పరిస్థితులకు అద్దం పడుతోంది. తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో పెద్దగా తేడాలు ఉండవని.. అక్కడక్కడా సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకశాలున్నట్లు తెలిపింది. శుక్రవారం గాలిలో తేమ 68 శాతంగా నమోదైందని పేర్కొంది.
అనూహ్యంగా పెరిగిన కరెంట్ వినియోగం..
నగరంలో పగటి ఉష్ణోగ్రతలు హెచ్చుతుండటంతో ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం పెరుగుతోంది. కరెంట్ వినియోగం కూడా క్రమంగా పెరుగుతోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో మెజారిటీ సిటీజన్లు ఇళ్లకే పరిమితం కావడం, ఎండలు పెరగడంతో మొన్నటి వరకు గ్రేటర్ పరిధిలో 40 మిలియన్ యూనిట్ల మేర ఉన్న విద్యుత్ వినియోగం శుక్రవారం 45 మిలియన్ యూనిట్ల మేర నమోదైందని సీపీడీసీఎల్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత సీజన్‌లో గృహ అవసరాలకు విద్యుత్ వినియోగం క్రమంగా పెరిగే అవకాశాలున్నాయని.. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు కరెంట్ వినియోగం పెరిగే అవకాశాలు లేవని స్పష్టం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment