అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్ కోసం తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తన వంతు వాటా మొత్తం నుంచి రూ.35.26 కోట్లు విడుదల చేసింది.
సాక్షి, హైదరాబాద్: అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్ కోసం తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తన వంతు వాటా మొత్తం నుంచి రూ.35.26 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వు జారీ చేసింది. రూ. 25.26 కోట్లను భూసేకరణ కోసం, మిగతా రూ.10 కోట్లను లైన్ నిర్మాణంలో తన వంతు వాటా కింద విడుదల చేస్తున్నట్టు అందులో పేర్కొంది. 17.20 కిలోమీటర్ల పొడవైన ఈ కొత్త లైన్ కోసం రైల్వేశాఖ 2012-13 బడ్జెట్‌లో మంజూరీ ఇచ్చింది. ఇందుకు రూ.117.74 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది.
ఇందులో 50 శాతం ఖర్చు (రూ.58.87కోట్ల)ను రాష్టప్రభుత్వం భరించాల్సి ఉంది. ఇప్పటి వరకు రైల్వేశాఖ దీనికోసం కేవలం రూ.12.10 కోట్లను మాత్రమే మూడు విడతల్లో విడుదల చేసింది. దీంతో రాష్ట్రప్రభుత్వం కూడా కేవలం రూ.1.75 కోట్లను మాత్రమే రైల్వేకు డిపాజిట్ చేసింది. నిధుల్లేక పోవడంతో రాష్ట్రప్రభుత్వం రూ.35.26 కోట్లను అందజేయాలని నిర్ణయించింది. నిధుల విడుదలతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగేందుకు అవకాశం ఏర్పడింది.