జింకల వేటగాళ్లను తప్పించారు: కిషన్‌రెడ్డి
సింగరేణి కార్మికుల జీతాల పెంపునకు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతంలో హైదరాబాద్‌కు చెందిన వేటగాళ్లు జింకలను వేటాడిన కేసులో దోషులను కావాలనే తప్పించారని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ‘‘వేటాడిన జింకలను చిన్నకారులో కుక్కి మిగతా వాహనాలను విడిచిపెట్టారు. అంత చిన్న కారులో పెద్ద పెద్ద జింకలను వేసుకుని ఎవరూ వెళ్లరు. దోషులను వదిలేశారని అక్కడి పరిస్థితి చూస్తేనే స్పష్టమవుతోంది’’ అని గురువారం సభలో ఆయన ధ్వజమెత్తారు. ‘ఎమ్మెల్యేల జీతాలు పెంచారు. మరి సింగరేణి కార్మికులేం పాపం చేశారు?’ అని ప్రశ్నించారు. వారికి కనీస వేతనాలు కూడా అందటం లేదని విమర్శించారు.
యాదాద్రి ప్రాజెక్టుకు సినీ వ్యక్తి ఆర్కిటెక్టా: పద్మావతి
యాదాద్రి దేవాలయాన్ని గొప్పగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినందుకు ఆనందం వేసినా, సినిమా రంగానికి చెందిన ఆనంద్‌సాయికి ఆర్కిటెక్ట్ బాధ్యత అప్పగించటం ఆశ్చర్యం, బాధ కలిగించాయని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. ఇంత గొప్ప ప్రాజెక్టును మంచి అర్కిటెక్ట్‌కు అప్పగిస్తే ఆలయం అనుకున్న రీతిలో రూపుదిద్దుకుంటుంది. ఈ భారీ ప్రాజెక్టులో నిపుణుడైన ఆర్కిటెక్ట్‌ను నియమిస్తే మేలు అని సూచించారు.