
మంత్రుల పీఏలమని టోకరా!
.సూర్యాపేట మున్సిపాలిటీ: రాష్ట్ర మంత్రులు మహమూద్‌అలీ, హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ పీఏలమని, తాము ఉద్యోగాలు ఇప్పిస్తామం టూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను నల్లగొండ జిల్లా సూర్యాపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు... కరీంనగర్ జిల్లా పోతర్లకు చెందిన హరీశ్ అలియాస్ హరి, వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన బానోతు రవీందర్ స్నేహితులు. కాగా హరీశ్ డిగ్రీ పథమ సంవత్సరం చదువుతూ మధ్యలోనే మానివేసి జల్సాలకు అలవాటుపడ్డాడు. అతని తల్లి ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్. రాష్ట్రమంత్రి ఈటెల రాజేం దర్ పీఏనని చెబుతూ 2014 అక్టోబర్‌లో తనతల్లి పనిచేస్తున్న ఇరిగేషన్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేశాడు.
ఈ క్రమంలో అప్పట్లో కరీంనగర్ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదవగా హరీశ్, అతని తల్లి సునీత, మామ గంగారపు సత్యపాల్‌ను అరెస్టు చేశారు. హరీశ్ హైదరాబాద్‌లో సూర్యాపేకు చెందిన అలువాల మణిరాజ్‌ను పరిచయం చేసుకొని తన డ్రైవర్ బానోతు రవీందర్‌తో కలసి సూర్యాపేటకు వచ్చి అలువాల మణిరాజు, ఆయన అక్క శృతి, గాజు జయచందర్, గునగంటి ఫణి, సాట్ల మధులకు రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. అయినా అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో విసిగిపోయిన మణిరాజు సూర్యాపేట పట్టణ పోలీసులకు గత నెల 26 ఫిర్యాదు చేశారు.
హరీశ్‌తో అతని స్నేహితుడు బానోతు రవీందర్ కలసి హైదరాబాద్‌లో ఎవరికీ అనుమానం రాకుండా నెట్ సెంటర్‌లో తెలంగాణ సింబల్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు హరీశ్‌రావు, ఈటెల లెటర్‌ప్యాడ్‌లు తయారు చేసుకొని అలువాల మణిరాజుకు, గాజుల శృతికి అపాయంట్‌మెంట్ ఆర్డర్ తయారు చేసి మహమూద్‌అలీ సంతకం ఫోర్జరీ చేశారు. శుక్రవారం ఉదయం హైటెక్ బస్టాండ్‌కు చేరుకొని బాధితులకు నకిలీ ఆర్డర్లు ఇస్తుండగా హరీశ్, బానోతు రవీందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద రూ. 50 వేలను స్వాధీనం చేసుకున్నారు.