సాక్షి: ఆర్‌ఆర్‌ఆర్ పనులు చేపట్టాలని కేంద్రం ఇప్పటికే మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. అధికారిక ఆదేశాలు ఎప్పుడు రానున్నాయి?
గణపతిరెడ్డి: రెండు వారాల్లో కేంద్రం నుంచి లిఖితపూర్వక ఆదేశాలు రానున్నాయి.
రీజినల్ రింగ్ నేపథ్యం వివరిస్తారా?
గ్రేటర్ హైదరాబాద్‌కు భవిష్యత్తులో ఎదురయ్యే ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో రింగ్ రోడ్ అవసరమన్న ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. ఆయన 2016లోనే ఈ ప్రతిపాదనను మాముందు ఉంచారు. రోజురోజుకు వేలాది కొత్తవాహనాలు రోడ్డు మీదకు వస్తున్న దరిమిలా.. ఇపుడున్న ఔటర్ రింగ్‌రోడ్ సామర్థ్యం సరిపోదని, భారీ వాహనాల రవాణాకు మరో కొత్త రింగు రోడ్డు (రీజినల్ రింగ్ రోడ్) కావాలని ఆయనే ప్రతిపాదించారు.
రీజినల్ రింగురోడ్డుతో మారనున్న తెలంగాణ ముఖచిత్రం
రోడ్డు ఆవశ్యకత ఏంటి?
నగరం నుంచి ఉన్న జాతీయ రహదారులపై వాహనభారం తీర్చేందుకు ఔటర్ రింగ్‌రోడ్డుకు అంకురార్పణ జరిగింది. కొత్త వాహనాలు రోడ్డు మీదకు వస్తుండటంతో రాబోయే ఐదేళ్లలో ఓఆర్‌ఆర్ కేవలం నగర అవసరాలకే పరిమితమవనుంది. అపుడు ఓఆర్‌ఆర్‌పై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. రోజురోజుకు పెరిగే అవసరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారులపై నిరాటంకమైన రవాణా ఉండాలంటే మరో రింగు రోడ్డు అనివార్యమైంది. అదే విషయాన్ని కేంద్రానికి వివరించి ఒప్పించగలిగాం.
డీపీఆర్ పనులు ఎంతవరకు వచ్చాయి?
డీపీఆర్ పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి.మరో 10 రోజుల్లో నివేదిక రావొచ్చని అంచనా వేస్తున్నాం. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు.
భూసేకరణ మొదలు పెట్టవచ్చని కేంద్రం చెప్పింది కదా? ఎంత భూమిని సేకరిస్తారు?
మొత్తం 338 కిలోమీటర్లు ఉండే ఈ రోడ్డు కోసం 11,000 ఎకరాల భూమిని సేకరిస్తాం. ఇందుకోసం ప్రాజెక్టు వ్యయంలో రూ.2,500 కోట్లు అవుతాయని అంచనా వేస్తున్నాం.
ఈ మార్గంలో ఇప్పటికే రోడ్డు అందుబాటులో ఉంది కదా? దాన్ని విస్తరిస్తారా?
గణపతిరెడ్డి: ఉన్న రోడ్డును విస్తరించడం సవాలుతో కూడుకున్నది.పైగా అనేక వంపులు, మలుపులు ఎదురై ప్రయాణానికి ఆటంకం కలుగుతుంది.పైగా మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లింపులు, కోర్టు కేసులు, స్టేలు పనులకు ఆటంకంగా మారతాయి. న్యాయపరంగా, ఆర్థికంగా అనేక చిక్కులు ఎదురవుతాయి. అందుకే, మేం పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్‌నే ఎంచుకోబోతున్నాం. ఇలాగైతే వంపులు లేని సాఫీ రోడ్డును నిర్మించగలం.
భవిష్యత్‌లో నగర వాసులకు ఎదురయ్యే ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకే రీజినల్ రింగ్‌రోడ్ ప్రతిపాదన తెచ్చామని, 2016లోనే సీఎం కేసీఆర్ ఈ ఆలోచన చేశారని ఆర్‌అండ్‌బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి చెప్పారు. ఇది కార్యరూపం దాలిస్తే ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా, నగరం కాలుష్యరహితంగా కూడా మారుతుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌కు మరో హారంగా భావిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌పై గణపతిరెడ్డి తన అభిప్రాయాలు ‘సాక్షి’తో పంచుకున్నారు.
మరో10 రోజుల్లో పూర్తికానున్న డీపీఆర్
ఈ రోడ్డు అధ్యయనానికి మోడల్‌గా మలేసియానే ఎందుకు ఎంచుకున్నారు? మలేసియాకు అధికారుల పర్యటన ఎపుడు?ఆ దేశంలో ఆర్థికాభివృద్ధిలో ఎక్స్‌ప్రెస్ హైవేల పాత్ర అద్భుతంగా ఉంది. ఆ విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా చూశారు. అందుకే, ఎక్స్‌ప్రెస్ హైవేగా నిర్మించాలని సూచించారు. ఇటీవల ఎన్నికల కోడ్ కారణంగా వీరి పర్యటన ఆగిపోయింది. జనవరిలో పర్యటన ఖరారవుతుంది.
అత్యాధునిక సదుపాయాలతో ఎక్స్‌ప్రెస్ హైవే
ఎక్స్‌ప్రెస్ హైవేపై ఎలాంటి సదుపాయాలు ఉంటాయి?
పూర్తిస్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రహదారి నిర్మాణం కానుంది. 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లేలా రోడ్డు సామర్థ్యం ఉంటుంది. రహదారిపై ప్రయాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం ఉండదు. పెట్రోల్, అంబులెన్స్, పికప్ క్రేన్ 24 గంటలు అందుబాటులో ఉంటాయి. టోల్‌గేట్లకు అత్యాధునిక టచ్ అండ్ గో సిస్టంతో టోల్ వసూలు చేసేందుకు స్మార్ట్ కార్డులు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
రీజినల్‌ను కలుపుతూ రేడియల్‌రోడ్లు ఎన్ని వస్తాయి?
ఇప్పటికే 10 రేడియల్ రోడ్లు ఉన్నాయి.దానికి లింకు రోడ్లు వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్రమే ప్రణాళికలు రూపొందిస్తుంది.
ప్రాజెక్టు పూర్తికాగానే నగరం నుంచి పరిశ్రమలు తరలింపు
ఈ రోడ్డుతో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది?
నగరంలో పెరుగుతున్న జనాభా వల్ల పరిశ్రమల చుట్టూ నివాస ప్రాంతాలు ఏర్పడ్డాయి.ఈ హానికారక పరిశ్రమలతో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి ప్రమాదకర పరిశ్రమలను ఔటర్ అవతలికి తరలించేందుకు వీలుంది. ఫలితంగా నగరంలో వాయుకాలుష్యం తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా నగరంలో పలు పరిశ్రమలు హానికారక రసాయనాలను మూసీలో వదులుతున్నాయి. ఇలాంటి పరిశ్రమల తరలింపు వల్ల మూసీ ప్రక్షాళన సులభతరమవుతుంది. అంతర్జాతీయ స్థాయి రోడ్డు సదుపాయాలు ఉండటం వల్ల ఐటీ, ఎగుమతులు, డ్రై పోర్టులు వచ్చి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రజల ఆర్థిక ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment