అభివృద్ధిపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు: గండ్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని, కలెక్టర్లతో జరిగిన సమీక్షాసమావేశమే దీనికి నిదర్శనమని కాంగ్రెస్ నేత, మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మన ఊరు– మన ప్రణాళిక అని.. గతంలో పట్టించుకోకుండా పక్కనబెట్టిన పాత ముచ్చటనే ఇప్పుడు కలెక్టర్లకు చెప్పార న్నారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించారని, ఆ సంగతిని మరిచిపోయారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విషజ్వరాలు, ఆరోగ్య సమస్యలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని, వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. నిలోఫర్ ఆసుపత్రిలో మందులు లేక గర్భిణులు చనిపోవడం బాధాకరమ న్నారు. వీటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.