హైదరాబాద్: సామాజిక స్మగ్లర్లు ‘కోమటోళ్లు’ పుస్తక రచయిత కంచ ఐలయ్య దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాలని నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా డిమాండ్ చేశారు. ఐలయ్య పుస్తకానికి కౌంటర్‌గా వైశ్య ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస) వేదిక కన్వీనర్, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కాచం సత్యనారాయణగుప్తా ‘సామాజిక సేవకులు వైశ్యులు’ అనే పేరుతో రాసిన పుస్తకాన్ని ఐజేయూ సెక్రటరీ దేవులపల్లి అమర్ శనివారం ఆవిష్కరించారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా మాట్లాడుతూ..ఐలయ్య ప్రధాని మోదీ గురించి కూడా తప్పుగా మాట్లాడిన వ్యక్తి అని..అతనిపై రాజద్రోహం కేసు పెట్టి దేశం నుంచి బహిష్కరించాలన్నారు. ఆర్యవైశ్యులు మాంసం తింటారంటూ పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్న ఐలయ్య సరైన చికిత్స తీసుకుని బయట ప్రపంచంలోకి రావాలన్నారు. ఐలయ్య అనే పెద్ద పిచ్చోడు బయట తిరుగుతుంటే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి వాళ్లు ఎందుకు చేర్చుకోవడం లేదో అర్థం కావడం లేదని..ఐలయ్యను త్వరగా ఆస్పత్రిలో చేర్పించుకోవాలని ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కోరుతున్నామన్నారు. ఆర్యవైశ్యులపై ఐలయ్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అన్ని పార్టీలు స్పందించినప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఇంత వరకు నోరు మెదపలేదన్నారు. ఐలయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.
నిందించే హక్కు లేదు..
ఐజేయూ సెక్రటరీ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ..ఐలయ్య గతంలో కూడా చాలా పుస్తకాలు రాసి ఎన్నో కులాల్ని దూషించారన్నారు. ఇప్పుడు కూడా అదే ధోరణిలో ఉన్నట్లు స్పష్టమవుతుందన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని.. ఒకర్ని నిందించే హక్కు ఇంకొకరికి లేదన్నారు. ఎదుటి వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించడం చాలా ప్రమాదకర మన్నారు. ఆయన రాసిన ఈ పుస్తకాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
పుస్తక రచయిత కాచం సత్యనారాయణగుప్తా మాట్లాడుతూ.. ఐలయ్య రాసిన పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరానికి జవాబుగా తాను కూడా ఈ పుస్తకాన్ని రాశానన్నారు. ఉపాధ్యాయ ముసుగులో ఉన్న ఉన్మాది ఐలయ్య అంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా, తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్, వైశ్య ఐకాస వేదిక గౌరవ సలహాదారు సోమ భరత్‌కుమార్, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ తదితరులు ప్రసంగించారు.
ఐలయ్యను అడ్డుకున్న ఆర్యవైశ్యులు
పోలీసులకు ఫిర్యాదు.. దళితులు, ఆర్యవైశ్యుల పోటాపోటీ నినాదాలు
పరకాల: వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ప్రొఫెసర్ కంచ ఐలయ్యను శనివారం ఆర్యవైశ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. భూపాలపల్లిలో టీ–మాస్ కార్యక్రమం లో పాల్గొని హన్మకొండకు వెళ్తున్న క్రమంలో పరకాల అంబేడ్కర్ సెంటర్ వద్ద ఐలయ్యను ఆర్యవైశ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేశారు.
ఠాణా వద్దకు వచ్చిన ఆర్యవైశ్యులు ఐలయ్య క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. దళితులు సైతం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఐలయ్యను పోలీసులు ఎస్కార్ట్ మధ్య అక్కడి నుంచి పంపించారు. ఈ క్రమంలో దళితులు, ఆర్యవైశ్యులు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లారు. పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించారు.
డ్రైవర్ అప్రమత్తం కావడంతో బతికిపోయా..
డ్రైవర్ అప్రమత్తమై కారును వేగంగా నడపడంతో బతికిపోయానని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పరకాలలో ఆర్యవైశ్యులు దూసుకొచ్చి కారుపై బలంగా బాదుతూ బయటకు లాగి కొట్టే ప్రయత్నం చేశారన్నారు.
అవి చీరలు కావు.. మసిబొంతకు వాడుకునేవి
భూపాలపల్లి: ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ ఓ సామాజిక స్మగ్లింగేనని.. అవి చీరలు కావు.. మసిబొంతకు వాడుకునేవని భూపాలపల్లిలో ఐలయ్య అన్నారు. రూ.25 విలువ చేసే బతుకమ్మ చీరకు.. రూ.200 అని చెప్పి సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత రూ.100 కోట్లు దండుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో గద్దర్, తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావు పాల్గొన్నారు.
ఐలయ్యపై సుప్రీంకోర్టులో పిటిషన్
ప్రపంచ ఆర్యవైశ్యమహాసభ
అధ్యక్షుడు రామకృష్ణ వెల్లడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్యవైశ్యుల మనో భావాలను కించపర చడమే కాకుండా సమాజంలోని కొన్ని వర్గాలను దాడులకు పురిగొల్పే విధంగా వ్యవహరిస్తున్న కంచ ఐలయ్యపై తగిన చర్య తీసుకోవాల్సిం దిగా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నట్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ తెలిపారు.
ఐలయ్య పోకడలను ఖండిస్తూ ఆర్యవైశ్య మహాసభ తరఫున ఇటీవల నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో పొల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు శనివారమిక్కడ∙వామ్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఐలయ్యపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కూడా కలవబోతున్నామని తెలిపారు.