ఉద్యోగాల పేరిట ఘరానా మోసం | gang collect 1 crore rupees from unemployees | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

Published Fri, Jan 23 2015 9:05 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

కరీంనగర్: ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి, మోసాలకు పాల్పడుతున్న ముఠా వ్యవహారం వెలుగు చూసింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని టూటౌన్ సీఐ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కమాన్‌పూర్ మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన కనుకుల మనోజ అలియాస్ మనోజ తివారి(22) నిరుద్యోగులకు ఎరవేసింది. అదే గ్రామానికి చెందిన గాజుల కనకశేఖర్‌కు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ట్రెయినీ ఇంజినీర్‌గా ఉద్యోగం ఇప్పిస్తామని రూ.20లక్షలు, అతని చెల్లెలు గాజుల స్రవంతికి స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇప్పిస్తామని రూ.6లక్షలు వసూలు చేసింది.

ఎన్ని రోజులైనా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు నిలదీయగా, మనోజ తివారి తప్పుడు ఉద్యోగపత్రాలు అందజేసింది. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఈనెల 11న గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కూపీ లాగగా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సింగరేణి కార్మికుడి కూతురైన మనోజ హైదరాబాద్‌లో డిగ్రీ చదివేందుకు వెళ్లింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-7కు చెందిన దేవరకొండ రాజన్న(47), పెరుగు తిరుపతి(40), కూకట్‌పల్లికి చెందిన డేగ శ్రీనివాస్(35), చంద్రమోహన్(39), జూబ్లిహిల్స్‌కు చెందిన మాకూరి సత్యనారాయణ(52), మెదక్‌కు చెందిన శ్రీలత(32)లతో కలిసి ఉద్యోగాల పేరుతో డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా ఖైరతాబాద్‌లో ఎల్‌ఆర్‌ఎస్ అనే సంస్థను నెలకొల్పారు. వీరి పేర్లు, సెల్‌నెంబర్ల ఆధారంగా హైదరాబాద్‌కు వెళ్లినప్పటికీ నిందితులు తప్పుడు చిరునామా చెబుతూ పలుమార్లు తప్పించుకున్నారు. చివరకు మనోజను అరెస్టు చేసి 420, 120(బి) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. ఆమె వద్ద నుంచి ల్యాప్‌టాప్, తప్పుడు జాబ్‌కాల్ లెటర్లు, బ్యాంక్‌పాస్‌బుక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. మిగతా ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. ఈ ముఠా ఇప్పటివరకు పలువురు నిరుద్యోగుల నుంచి సుమారు రూ.కోటి వసూలు చేసినట్టు తెలిపారు. మనోజ మాట్లాడుతూ.. ఈ విషయాలు రాజన్న చూసుకునే వాడని, తనకు డబ్బులు ఇచ్చేవారు కాదని, హైదరాబాద్‌లో విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని రూ.11లక్షలు వసూలు చేశామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement