♦ ప్రజా సమస్యలపై పోరులో రాజీ లేదు
♦ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం
♦ ‘సాక్షి’తో వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తమ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షునిగా నియమితుడైన డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. పార్టీని సంస్థాగతంగా కిందిస్థాయి నుంచి బలోపేతం చేస్తామని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడే విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులను కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా నియమితుడైన సందర్భంగా శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను వైఎస్సార్‌సీపీ పోషిస్తుందన్నారు. పది జిల్లాల్లో ప్రజలు ఎదురొంటున్న సమస్యలపై ఎక్కడికక్కడ స్పందిస్తూ వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో క్రియాశీలంగా వ్యవహరిస్తామన్నారు. ‘‘ముందుగా పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పటిష్టపరచడంపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఈ విషయంలో కార్యకర్తలకు చేదోడువాదోడుగా ఉంటూ వారికి పూర్తి అండదండలందిస్తాం. జిల్లాలవారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిపై ఉద్యమించేలా కార్యాచరణను రూపొందిస్తాం’’ అని వివరించారు.
నల్లగొండ పట్టణానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి జువాలజీలో ఎమ్మెస్సీ పట్టా, బయో కెమిస్ట్రీలో డాక్టరేట్ సాధించారు. గతంలో బీజేపీలో కొనసాగారు. ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై 2007లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచీ పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. నల్లగొండ జిల్లా హుజుర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో పోటీ చేశారు.