‘జియోట్యాగింగ్’తో అక్రమాలకు చెక్
- ఇకనుంచి ఆన్‌లైన్‌లో మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతి
- అందుబాటులోకి కొత్త విధానం
- త్వరలో గద్వాలలో అమలు
గద్వాల : మరుగుదొడ్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడే అవకాశం ఇక నుంచి ఉండదు. ఏది నిర్మించకపోయినా బిల్లులు మంజూరు చేయిం చుకోవడం కుదరదు. పాతవాటిని చూపి కొత్తగా నిర్మించామని చెప్పినా ఎవరూ పట్టిం చుకోరు. వీటి నిర్మాణాల్లో జరిగే అవకతవకలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జియోట్యాగింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. గద్వాల పట్టణంలో చేపట్టనున్న మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం తాజాగా రూ.25లక్షలు మంజూరు చేసింది. నిర్మాణాల్లో అక్రమాలు చోటుచేసుకోకుండా నిఘా ఉంచేందుకు జియోట్యాగింగ్ వ్యవస్థలను అనుసంధానం చేయనుంది.
లబ్ధిదారులు గుంత తవ్విన నాటి నుంచి పూర్తయ్యే వరకు గల ఫొటోలు ఆన్‌లైన్‌లో అనుసంధానం చేస్తారు. దీనికోసం త్వరలో ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను సైతం రూపొందించనున్నారు. పురపాలకశాఖ అధికారులు, సిబ్బంది వీటి నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. మరుగుదొడ్డి నిర్మించిన స్థలంతోపాటు ప్రాంతం తదితర వాటిని సైతం పరిగణలోకి తీసుకుంటారు. దీంతో లబ్ధిదారులు నిర్మించుకునే మరుగుదొడ్లు పూర్తయ్యే వరకు ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి. దీంతో పాతవాటిని చూపించి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదు. దీంతో అర్హులకు న్యాయం జరిగే అవకాశముంది.
పట్టణంలో 1,100 లబ్ధిదారుల గుర్తింపు
పట్టణంలో మరుగుదొడ్ల నిర్మాణాల ప్రక్రియలో ఆలస్యం చోటు చేసుకుంటుంది. లబ్ధిదారులకు సంబంధించి వివరాల నమోదు నెమ్మదిగా సాగుతుండడంతో వీటి నిర్మాణాలు కొలిక్కి రావడం లేదు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం పట్టణంలో మరుగుదొడ్లు లేనివారు సుమారు రెండువేల మంది ఉన్నట్లు తేలింది. వీరికి మరుగుదొడ్ల మంజూరు పత్రాలను అందించేందుకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటిదాకా 1,300మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులను విచారించిన అధికారులు 1,100మంది అర్హులున్నట్లు తేల్చారు. గత నెలలో కాలనీల వారీగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. త్వరలో వీటి నిర్మాణాలను పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
చెల్లింపులు ఇలా..
ప్రభుత్వం ఒక్కో మరుగుదొడ్డికి రూ.12వేలు అందజేస్తోంది. వీటిని రెండు విడతల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమ చేయనున్నారు. బేస్‌మెంట్, సెప్టిక్‌ట్యాంక్ నిర్మాణం పూర్తయితే రూ.6 వేలు, మరుగుదొడ్డి నిర్మాణం మొత్తం పూర్తయితే మరో రూ.6 వేలు అందజేయనున్నారు.
త్వరలో నిర్మాణాలు పూర్తిచేస్తాం..
మరుగుదొడ్ల నిర్మాణాల కోసం ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించి మంజూరు పత్రాలు కూడా అందజేశాం. కొన్నివార్డుల్లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే అన్నివార్డుల్లో నిర్మాణాలు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం.
-నాగేంద్రబాబు,
ఇన్‌చార్జి కమిషనర్, గద్వాల మున్సిపాలిటీ