
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు స్పెషల్‌డ్రైవ్ చేపట్టిన జీహెచ్‌ఎంసీ అధికారులు.. ధ్వంసమైన ఫుట్‌పాత్‌ల పునరుద్ధరణతోపాటు ప్రధాన రహదారుల వెంబడి పాదచారులు నడిచేందుకు వీలుగా కొత్త ఫుట్‌పాత్‌లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఇవి పర్యావరణ హితంగా ఉండేందుకు తగిన విధివిధానాలు రూపొందించారు.
అర్బన్ రోడ్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టనున్నారు. అన్ని రహదారులకు.. ముఖ్యంగా ప్రధాన మార్గాల్లోని దాదాపు 900 కి.మీ. మేర రహదారుల వెంబడి ప్రజలు నడవడానికి వీలుగా ఫుట్‌పాత్‌లు నిర్మించాలని.. వీటి కనిష్ట వెడల్పు 1.2 మీటర్లకు తగ్గకూడదని, గరిష్టంగా స్థల సదుపాయాన్ని బట్టి ఐదడుగుల వరకు కూడా నిర్మించాలని నిర్ణయించారు. వీటి నిర్మాణానికి దాదాపు రూ.250 కోట్లు ఖర్చు కాగలదని అంచనా.
ప్రమాణాలకు అనుగుణంగా..
నిర్ణీత ప్రమాణాల మేరకు రోడ్డు వెడల్పులో పదిశాతానికి తగ్గకుండా ఫుట్‌పాత్ ఉండాలి. రోడ్డుకు ఒక్కోవైపు పదిశాతం వంతున రెండు వైపులా వెరసి 20 శాతం ఫుట్‌పాత్‌లు ఉండాలి. ఉదాహరణకు రోడ్డు వెడల్పు వంద అడుగులుంటే ఒక్కో వైపు పది అడుగుల వంతున ఫుట్‌పాత్‌లుండాలి.
కానీ నగరంలోని పరిస్థితుల దృష్ట్యా ఇది సాధ్యం కాదని భావించి, రోడ్డు వెడల్పు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ కనిష్టంగా 1.2 మీటర్లయినా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు.ప్రతి ఫుట్‌పాత్‌కు ప్రీకాస్ట్ కెర్బింగ్ వాడాలని, వర్షం వచ్చినప్పుడు నీరు ఫుట్‌పాత్‌లపై నిల్వకుండా సన్నని రంధ్రాలున్న పేవర్‌బ్లాక్‌లు వినియోగించాలని సంబంధిత ఇంజనీర్లకు సూచించారు. ఇసుక లేదా స్టోన్ డస్ట్‌పైన పేవర్‌బ్లాక్‌లు అమర్చాలని, కెర్బ్‌ల కనీస ఎత్తు 300 మి.మీ.లుగా ఉండాలని నిర్ణయించారు.
వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలకు ఇబ్బంది కలుగకుండా ఫుట్‌పాత్‌లపైకి వెళ్లే ప్రవేశమార్గాల్లో తగిన ర్యాంప్‌లు, ద్విచక్ర వాహనాలు ఫుట్‌పాత్‌లపైకి వెళ్లకుండా నిర్ణీత ప్రదేశాల్లో బొల్లార్డ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఫుట్‌పాత్‌లన్నీ ఒకే రూపంలో, చూడటానికి అందంగా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. గ్రే, బ్లాక్, రెడ్ రంగుల్లో ఉండే పేవర్‌బ్లాక్‌లు వినియోగించాలని నిర్ణయించారు.
నిర్వహణపై అశ్రద్ధ వద్దు
నగరంలో ఇప్పటి వరకు నిర్మించినట్లు తూతూమంత్రంగా కాకుండా, నిర్ణీత ప్రమాణాల మేరకు ఫుట్‌పాత్‌లను నిర్మించడంతో పాటు నిర్వహణ బాధ్యతలు కూడా చూడాల్సిందిగా జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజనీర్ జియావుద్దీన్ సూపరింటెండింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు సూచించారు. ఫుట్‌పాత్‌లు ప్రజలు సాఫీగా, సజావుగా నడిచేందుకు వీలుగా.. వాటిపై ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా సంబంధిత ప్రాంతాల్లోని ఇంజనీర్లు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
ఇలా అయితే ఎలా..?
ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి సంబంధించిన సూచనలైతే బాగానే ఉన్నప్పటికీ.. నగరంలోని ప్రధాన రహదారులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలో లేవు. చాలావరకు హెచ్‌ఆర్‌డీసీఎల్ (హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) పరిధిలో ఉన్నాయి. మెట్రో మార్గాల్లో హెచ్‌ఎంఆర్‌ఎల్ పరిధిలో ఉన్నాయి.
ఎర్రమంజిల్ వద్ద నిర్మిస్తున్న ఫుట్‌పాత్‌లకు పేవర్‌బ్లాక్‌ల కింద ఇసుక, స్టోన్‌డస్ట్ బదులు సిమెంట్ వినియోగిస్తున్నందువల్ల వర్షపు నీరు లోనికి ఇంకకుండా ఫుట్‌పాత్‌లపై నీరు నిలిచే ప్రమాదముందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఇదే అంశాన్ని జీహెచ్‌ఎంసీ ఇంజనీర్ల వద్ద ప్రస్తావిస్తే.. మెట్రో రైలు మార్గంలో ఉన్న అది తమ పరిధిలోది కాదన్నారు. ఆ పనులతో తమకు సంబంధం లేదని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment