
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా కాంగ్రెస్ అధినాయకత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆ పార్టీ ట్రబుల్ షూటర్లలో ఒకరైన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌ను రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ నెలాఖరులో లేదా నవంబర్ మొదటి వారంలో ఆజాద్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అత్యున్నత విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. గత పదేళ్లుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న దిగ్విజయ్‌సింగ్‌ను ఇటీవలే తప్పించి ఆర్‌సీ కుంతియాను నియమించిన సంగతి తెలిసిందే.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత కొరవడటం, క్రమశిక్షణారాహిత్యం పెరిగిపోవడం వంటి అంశాలను చక్కదిద్దేందుకు కుంతియా ఏమాత్రం ప్రయత్నించడంలేదని, ఆయనకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి స్థాయి లేదని సీనియర్ నేతలు కొందరు అధిష్టానవర్గం దృష్టికి తీసుకెళ్లారు. కొందరైతే కుంతియాపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నేతలను ఏకతాటిపైకి తీసుకురావడంతోపాటు పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందించే బాధ్యతను ఆజాద్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఎన్నికలకు ఏడాది ముందుగా ఆజాద్‌ను రంగంలోకి దించాలని పార్టీ ముందుగా భావించింది. అయితే వచ్చే ఏడాది నవంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన నియామక పక్రటనను కూడా ముందుకు జరిపినట్లు సమాచారం.
కుంతియాను లెక్కచేయని నేతలు
మామూలుగా అధిష్టానవర్గం ఎవరిని ఇన్‌చార్జిగా నియమించినా కాంగ్రెస్ నేతలు ఆయన చెప్పినట్లు నడుచుకోవడం కొంతవరకు ఆనవాయితీ. కానీ కుంతియాను ఇన్‌చార్జిగా నియమించిన నాటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో అసహనం పెరిగిపోయింది. కుంతియాకు ఇన్‌చార్జి స్థాయి లేదంటూ నేతలు బహిరంగంగా విమర్శించడమే కాకుండా వెంటనే ఆయన్ను తొలగించాలని అనేక మంది ఢిల్లీకి వెళ్లారు. నేరుగా సోనియా, రాహుల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరులు అయితే ఏకంగా తాము పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతామంటూ బహిరంగంగా అల్టిమేటమ్ జారీ చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా ఏ మాత్రం పనికిరారని, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన నడుచుకుంటున్నారని మాజీ రాజ్యసభ సభ్యుడొకరు రాహుల్‌కు ఫిర్యాదు చేశారు. కుంతియాను కొనసాగిస్తే కాంగ్రెస్‌లో ఎవరూ మిగలరని, ఓ స్థాయి కలిగిన నేతను నియమిస్తే బాగుంటుందని అనేక మంది ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా అధిష్టానవర్గానికి సూచించినట్లు సమాచారం.
కోమటిరెడ్డి సోదరులను నిలువరించిన ఆజాద్
రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా వ్యవహరించే సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో కాంగ్రెస్‌కు పనికొచ్చే నాయకులుగా పేరున్న కోమటిరెడ్డి సోదరులు పార్టీ వీడుతున్నారని తెలియడంతోనే ఆజాద్ రంగంలోకి దిగారు. అధిష్టానవర్గంతో మాట్లాడి కోమటిరెడ్డి సోదరులను ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపారు. పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడొద్దని సూచించారు. వారి భవిష్యత్‌కు భరోసా ఇచ్చారు. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితో కూడా మాట్లాడిన ఆజాద్.. కోమటిరెడ్డి సోదరులు పార్టీ వీడకుండా చర్చలు జరపాలని సూచించారు.
నాలుగు రోజుల క్రితం మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డిని తన నివాసానికి పిలిపించుకుని జైపాల్‌రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరపారు. మరుసటి రోజే రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి ఆజాద్, రాహుల్‌గాంధీని కలిసి వచ్చినట్లు తెలిసింది. ఆజాద్‌ను పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమిస్తే తాము పార్టీలోనే ఉంటామని కోమటిరెడ్డి సోదరులు తమ సన్నిహితులతో చెబుతున్నారు.
పార్టీ వీడిన వారిని రప్పించేందుకు చర్యలు
గడచిన మూడేళ్ల కాలంలో పార్టీని వీడి వెళ్లిపోయిన వారిని తిరిగి సొంత గూటికి తెచ్చేందుకు కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. ఇటీవల ఆజాద్ ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా .. సీనియర్ నేతలకు ఇందుకు సంబంధించి కొన్ని సూచనలు చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాయకత్వంలో సీనియర్ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు, జీవన్‌రెడ్డి, డీకే అరుణ తదితరులతో కమిటీ వేయాలని, పార్టీని వీడి వెళ్లినవారితో ఈ కమిటీ సంప్రదింపులు జరపాలని సలహా ఇచ్చినట్లు తెలిసింది. అయితే దీనిపై విధానపరమైన ప్రకటన వెలువడిన తర్వాతే పార్టీ వీడి వెళ్లిన వారితో చర్చలు ఉంటాయని పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ఆజాద్ తిరిగి రాష్ట్ర ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరిస్తారన్న సమాచారం రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం నింపింది.
Comments
Please login to add a commentAdd a comment