కొనసాగుతున్న నిరసన జ్వాలలు
రుణాల మాఫీకి సంబంధించి కాలపరిమితి షరతును ఎత్తివేయాలంటూ రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. పలుచోట్ల సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేసి రాస్తారోకోలకు దిగారు. వారికి పలు పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.
అన్నదాతల బతుకులతో ఆటలాడొద్దు : వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్
ఇబ్రహీంపట్నం రూరల్: రైతు రుణాల మాఫీపై ప్రభుత్వం మాట మార్చిందంటూ వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామంటూ అధికారంలోకి వచ్చి ఇప్పుడు కొత్త నిబంధనలు విధించడం సబబు కాదన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పార్టీ నాయకులు, రైతులు ఆందోళన చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఈసీ శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ.. గద్దెనెక్కి వారం కూడా కాకముందే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమమని వేలాదిమంది యువకులను ఉసిగొల్పి వారి ఆత్మబలిదానాల సాక్షిగా ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ పదవిలోకి వచ్చినాక అన్నీ మర్చిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే అన్ని వసతులు సమకూరుస్తాం.. రుణాలు మాఫీ చేస్తాం.. ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చి ఇప్పుడు కేసీఆర్ చేతులెత్తేశారన్నారు. ప్రభుత్వం అసమర్థత వల్ల అన్నదాతల జీవితాలు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.
ఇప్పటికే పలుచోట్ల రుణాలు మాఫీ అవుతాయో లేదో అని కొన్ని రైతన్నల గుండెలు ఆగిపోయాయని.. ప్రభుత్వం మాటమారిస్తే మరిన్ని అన్నదాతల గుండెలు ఆగిపోయే అవకాశాలు కల్పించినట్లవుతుందని పేర్కొన్నారు. ఏ హామీల పేరుతో అధికారాన్ని చేపట్టారో.. ఆ హామీలను నెరవేర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ సభ్యులు నాయిని సుదర్శన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పల్లె సాయిబాబగౌడ్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాల పార్టీ నాయకులు తాళ్ల క్రిష్ణగౌడ్, బాబులు, చిత్రం జంగయ్య, ముత్యాల శ్రీహరి, దార నర్సింహా, సుధీర్‌రెడ్డి, సుజాత, శ్రీనివాస్‌రెడ్డి, సుగుణమ్మ, జయరాజ్, రత్న మ్మ, సంగీత, అనసూయ తదితరులున్నారు.
రైతులను వంచించారు
ధారూరు, న్యూస్‌లైన్: రైతుల రుణ మాఫీపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాట తప్పిందంటూ అన్నదాతలు ఆగ్రహించారు. ప్రభుత్వ నిర్ణయానిన నిరసిస్తూ ఆందోళనకు దిగారు. 2010 ఏప్రిల్ నుంచి 2014 మే 31 వరకు రైతులు తీసుకున్న పంటల రుణాలన్నింటినీ మాఫి చేయాలని డిమాండు చేస్తూ ధారూరు మండలం కేరెళ్లి గ్రామ రైతులు తాండూరు-హైదరాబాద్ ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసిన నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఈ సందర్భంగా రైతు నాయకుడు చెన్నారెడ్డి మాట్లాడుతూ.. అతివృష్టి, అనావృష్టిలతో పంటలు చేతికందక అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టి కేసీఆర్ మాట మార్చడం తగదన్నారు. రుణమాఫీతో తమ అప్పులు తీరుతాయని గంపెడాశతో ఉన్న తమను ప్రభుత్వం వంచించిదన్నారు. రైతుల ఉసురు పోసుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని గుర్తు చేశారు. వ్యవసాయానుబంధ రంగాల రైతులు తీసుకున్న రూ. లక్షలోపు రుణాలను కూడా మాఫీ చేయాలన్నారు.
లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దాదాపు మూడు గంటల పాటు ప్రధాన రోడ్డుపై కొనసాగిన రైతుల ధర్నాతో తాండూరు-హైదరాబాద్ రోడ్డుపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేరెళ్లి గ్రామానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు.