రుణాలు మాఫీ చేయాలి
డ్వాక్రా సంఘాల సభ్యుల రాస్తారోకో
రెబ్బెన : తాము గతంలో తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని డ్వాక్రా సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం డ్వాక్రా సంఘాల మహిళలంతా మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి ఆందోళనలో పాల్గొని సభ్యులనుద్దేశించి మాట్లాడారు. రైతుల పంటరుణాల మాఫీ నేపథ్యంలో డ్వాక్రా సంఘాల సభ్యుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న డ్వాక్రా సంఘాల సభ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు.
రాష్ట్రంలో రైతులతోపాటు మహిళలు సైతం ఓట్లు వేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాల రుణ పరిమితి పెంచే బదులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తే సభ్యులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే మహిళలందరూ రుణమాఫీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. డ్వాక్రా సంఘాల సభ్యుల రుణాలు మాఫీ చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ పెసరి వెంకటమ్మ, డ్వాక్రా సంఘాల సభ్యులు అనిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.