‘మిషన్’కు రూ.5 వేల కోట్లివ్వండి
ఆర్థిక మంత్రి జైట్లీకి సీఎం కేసీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్ : జల సంరక్షణ, భూగర్భ జలాల అభివృద్ధి లక్ష్యంగా చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి రూ. 5 వేల కోట్ల సాయం అందించాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఆయన శనివారం లేఖ రాశారు. వచ్చే మూడేళ్ల కోసం మిషన్ కాకతీయ కోసం రూ. 5 వేల కోట్ల సాయం అందించాలని నీతి ఆయోగ్ చేసిన సిఫారసులను సీఎం తన లేఖలో ప్రస్తావించారు.
అలాగే తెలంగాణలోని వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించాలని ఏపీ పునర్విభజన చట్టం చెబుతోందని...అందుకనుగుణంగానే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు 2015-19 కాలానికి రూ. 30,571 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని గతంలో కోరిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు. కేంద్ర జలవనరులశాఖ ద్వారా దేశవ్యాప్తంగా జల సంరక్షణ, భూగర్భ జలాల అభివృద్ధి కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సీఎం అన్నారు. అదే లక్ష్యంతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. మిషన్ కాకతీయ పురోగతి, కార్యక్రమాలను సీఎం లేఖలో వివరించారు.