వైఎస్సార్ విగ్రహానికి షర్మిల నివాళి
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలో సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించనున్నట్లు ఆదివారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండా రాఘవరెడ్డి, జిల్లా నాయకుడు ఏనుగు మహిపాల్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆమె సోమవారం నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు.
ఇందులో భాగంగా మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లికి వెళుతూ మార్గమధ్యలో ఇబ్రహీంపట్నంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ నేతలు గట్టు రాంచందర్‌రావు, రహమాన్, జనక్‌ప్రసాద్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె. శివకుమార్ తదితరులు పాల్గొంటారని ఆయన చెప్పారు.
అభిమానుల ఎదురుచూపులు
ఇబ్రహీంపట్నంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి షర్మిల నివాళి అర్పించనున్నారనే సమాచారం తెలియడంతో అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆమె రాకకోసం ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు షర్మిలకు ఘన స్వాగతం పలకనున్నారు. బొంగ్లూర్ ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి ఇబ్రహీంపట్నం వరకు వైఎస్సార్ సీపీ జెండాలను, ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు.