గోదారి హోరు | Godavari River flooded, hits first warning level | Sakshi
Sakshi News home page

గోదారి హోరు

Published Mon, Sep 8 2014 3:28 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM

గోదారి హోరు - Sakshi

గోదారి హోరు

- భద్రాద్రి వద్ద 48 అడుగులకు నీటిమట్టం
- రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- ఏజెన్సీలో 50 గ్రామాలకు రాకపోకలు బంద్
- భారీ వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న వాగులు
- సురక్షితంగా బయటపడ్డ ఛత్తీస్‌గఢ్ కూలీలు
- నీటమునిగిన వరి, మిర్చి, పత్తి పంటలు
- అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
భద్రాచలం:
గోదావరి నదికి వరద పోటెత్తింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా నీటి ప్రవహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద ఆదివారం రాత్రి గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరుకోవటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదికి ఈ ఏడాది ఈస్థాయిలో నీటిప్రవాహం రావడం ఇదే తొలిసారి. వాస్తవంగా ఆగస్టు నెలలోనే గోదావరి నదికి వరదలు రావటం పరిపాటి . కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు సరైన వర్షాలు లేకపోవటంతో ఈ ప్రాంత వాసులకు వరద ముప్పు తప్పంది. కానీ రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండాయి. భారీగా వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. కాలేశ్వరం, ఇంద్రావతి ప్రాజెక్టుల నుంచి వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరుతోంది.
 
చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా నీటి ప్రవాహం వచ్చి చేరుతుండటంతో 13 గేట్లను ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దిగువన ఉన్న శ బరి నది కూడా పోటెత్తుతోంది. అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి వరదతో వాజేడు మండలంలోని పలు గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చీకుపల్లివాగు పోటెత్తటంతో రహదారి పూర్తిగా మునిగిపోయింది. కొంగాలవాగు పొంగి ప్రవహిస్తోంది.  వాజేడు మండల కేంద్రం నుంచి అవతల ఉన్న గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాజేడు- వెంకటాపురం మండలాల్లోని గుండ్లవాగు వద్ద జాతీయ రహదారిపై నిర్మిస్తున్న చప్టా కుంగిపోయింది. వాజేడుకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు వెంకటాపురం నుంచే వెనుదిరుగుతున్నాయి.
 
ఉధృతంగా వాగులు...
భారీ వర్షాలతో ఏజెన్సీ ప్రాంతంలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వాజేడు మండలంలోని చీకుపల్లి, కొంగాలవాగు పొంగటంతో కిలోమీటర్ మేర రహదారిపై నీరు చేరింది. గోదావరి ఒక్కసారిగా పెరగటంతో వెంకటాపురం మండలం లంకల్లోని మిర్చితోటల్లో పనుల కోసమని వెళ్లిన ఛత్తీస్‌గఢ్ కూలీలు ప్రవాహంలో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు నాటుపడవలను ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. డొంకరాయి, మోతుగూడెం ప్రాజెక్టులు కూడా నిండటంతో భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనివల్ల శబరి నది పోటెత్తుతోంది. సోకిలేరు, కుయిగూరు వాగులు ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గిరిజన గ్రామాల ప్రజానీకం రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఏజెన్సీలో గోదావరి పరీవాహక మండలాల్లో సుమారుగా 50  గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
 
వందలాది ఎకరాల్లో నీటమునిగిన పంటలు
భారీ వర్షాలకు తోడు గోదావరి వరద కూడా ఒక్కసారిగా పెరగటంతో పరీవాహక ప్రాంతంలోని వందలాది ఎకరాల్లో మిర్చి, వరి, పత్తి పంటలు నీటమునిగాయి. ఒక్క వాజేడు మండలంలోనే 400 ఎకరాల్లో వరి, 60 ఎకరాల్లో మిర్చి తోటలు పూర్తిగా నీటిపాలయ్యాయి. వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లో గోదావరి నదికి ఆనుకొని ఉన్న పొలాల్లోకి నీరు చేరింది.
 
అధికారుల ముందుజాగ్రత్త
గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండటంతో పరీవాహక మండలాల అధికారులను జిల్లా కలెక్టర్ ఇలంబరితి అప్రమత్తం చేశారు. వరదల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రాచలం ఐటీడీఏ పీవో దివ్య, ఆర్‌డీవో ఆర్.అంజయ్య సంబంధిత అధికారులతో కలసి ఆదివారం గోదావరి వర ద పరిస్థితిని పరిశీలించారు. ఎప్పటికప్పుడు గోదావరి నీటిమట్టం గురించి కేంద్ర జలవనరుల సంఘం అధికారుల ద్వారా తెలుసుకున్నారు.

డివిజన్‌లోని ఆయా మండలాల అధికారులను అప్రమత్తం చేశారు. డివిజన్ ప్రజానీకం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ముంపు ప్రభావిత ప్రాంతాలవారు సురక్షిత ప్రాంతాలకు తరలాల్సిందిగా సూచించారు. మండల అధికారులంతా స్థానికంగా ఉండి వరద సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన మండలాల్లో తూర్పు గోదావరి ఆర్‌డీవో పర్యటించి వరద పరిస్థితిపై సమీక్షించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement