సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం శనివారం కొంత శాంతించినప్పటికీ భద్రాచలం వద్ద గోదావరిలో మాత్రం నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు రెండు రోజులుగా జిల్లాలో పొంగిపొర్లి ప్రవహించిన వాగులు కొంత తగ్గుముఖం పట్టాయి. కాగా పలు చెరువుల్లోకి కొత్తనీరు వచ్చి చేరుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు శుక్రవారం రాకపోకలు నిలిచిపోగా, శనివారం ఆ పరిస్థితి కనిపించలేదు. చర్ల మండలంలోని చింతగుప్ప, బోధనెల్లి గ్రామాల సమీపంలో మాత్రం వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఎగువ ప్రాంతాల్లోని గ్రామాలకు రెండో రోజు కూడా రాకపోకలు నిలిచిపోయాయి.
భద్రాచలం వద్ద గత వారం రోజులుగా గోదావరి దోబూచులాడుతోంది. ఎగువన కురు స్తున్న వర్షాలకు ఇంద్రావతి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద పెరుగుతోంది. జిల్లాకు దిగువన శబరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గోదావరి ఎగపోటు వేస్తోంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఇటీవల తగ్గుముఖం పట్టిన వరద మళ్లీ పెరిగింది. శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. సాయంత్రం 4 గంటలకు 46 అడుగులకు చేరింది. ఈ వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.
వరద పరిస్థితులను సమీక్షిస్తున్న కలెక్టర్..
భద్రాద్రి కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ శనివారం భద్రాచలం చేరుకుని గోదావరి వరద పరిస్థితిని సమీక్షించారు. కరకట్ట వద్ద ఉన్న స్లూయీస్‌లను పరిశీలించారు. సాయంత్రం స్లూయీస్ గేట్ల ద్వారా పట్టణంలోకి గోదావరి నీరు రావడంతో అధికారులు భారీ మోటార్ల ద్వారా తిరిగి గోదావరిలోకి పంపింగ్ చేయించారు. వరద పరిస్థితులను ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా కలెక్టర్ కార్యాలయంలో 08744–241950, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 08743–232444 నంబర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 24 గంటలు ఈ కంట్రోల్ రూమ్‌లు పనిచేస్తాయని, వరద సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రజలు ఈ నంబర్లకు కాల్ చేయవచ్చని ప్రకటించారు. గ్రామాల్లో వరద పరిస్థితులను పరిశీలించేందుకు తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సెక్టోరియల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. 3వ ప్రమాద హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడి వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముంపు ప్రాంతాల్లోని గర్భిణులను గుర్తించి ప్రసవ సమయంలోగా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
గోదావరి వరద ప్రవాహం పెరిగితే...
కరకట్ట సమీపంలోని కొత్తకాలనీ, సుభాష్‌నగర్ వైపు స్లూయీస్‌లు ఉండడం, వరదనీరు లీకేజీ అవుతుండటంతో మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని తిరిగి గోదావరిలోకి పంపింగ్ చేస్తున్నారు. కాగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులు దాటితే వాజేడు మండలంలోని 5 గ్రామాలు, వెంకటాపురం మండలంలోని 6 గ్రామాలు, చర్ల మండలంలో 2 గ్రామాలు, దుమ్ముగూడెం మండలంలోని 10 గ్రామాలు, భద్రాచలం మండలంలో కొన్ని కాలనీలు నీట మునిగే ప్రమాదం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు మండలంలో 2 గ్రామాలు, వీఆర్‌పురం మండలంలోని 6 గ్రామాలు వరద ముంపునకు గురవుతాయి. 50 అడుగులు దాటితే ఎటపాక వద్ద రాకపోకలు నిలిచిపోతాయి. అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లోని కొన్ని గ్రామాలు జల దిగ్బంధానికి గురయ్యే అవకాశం ఉంది.
తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేత...
చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. అయితే శనివారం మాత్రం 24 గేట్లను పూర్తిగా ఎత్తి 1,18,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. చింతగుప్ప, బోధనెల్లి గ్రామాల సమీపంలోని వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఎగువ ప్రాంతాల్లోని గ్రామాలకు రెండోరోజు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్‌లో శనివారం సాయంత్రానికి 397.40 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. 2,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 5.983 టీఎంసీల నీళ్లు కిన్నెరసాని రిజర్వాయర్‌లో నిల్వ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment