అన్నీ మంచి శకునములే.. | Good indicators to Pranahitha-Chevella project | Sakshi
Sakshi News home page

అన్నీ మంచి శకునములే..

Published Mon, Nov 24 2014 2:01 AM | Last Updated on Sat, Aug 25 2018 6:58 PM

అన్నీ మంచి శకునములే.. - Sakshi

అన్నీ మంచి శకునములే..

 ‘ప్రాణహిత’కు వీడుతున్న చిక్కులు
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును సమర్థిస్తూ సీడబ్ల్యూపీఆర్‌ఎస్ తుది నివేదిక
ఇప్పటికే సిద్ధమైన అటవీ భూ పరిహార నివేదిక.. త్వరలో కేంద్రానికి
తడ్కపల్లి, పాములపర్తి రిజర్వాయర్‌ల సామర్థ్యం పెంపుదల
నేడు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన

 సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులన్నింటికీ శుభసూచకాలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 16 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టుపై పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఒక్కొక్కటిగా ప్రాణం పోసుకుంటున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నీటిని ఎత్తిపోసేందుకు ఉద్దేశించిన బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర అభ్యంతరాలను పక్కనపెట్టి, తెలంగాణ చేసిన నిర్ణయాన్ని సమర్థిస్తూ రెండు రోజుల కిందట కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) నివేదిక సమర్పించింది. దీంతో మహారాష్ట్రలో భూసేకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. ప్రాజెక్టు నిర్మాణంవల్ల కోల్పోతున్న అటవీ భూమికి పరిహారంగా ప్రత్యామ్నాయ భూముల కేటాయింపునకు సంబంధించిన నివేదికలు ఇప్పటికే రాష్ట్ర అటవీ శాఖకు చేరాయి. అవి మరో రెండు, మూడు రోజుల్లో కేంద్రం పరిశీలనకు వెళ్లనున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహితపై నిర్మించదలిచిన  తడ్కపల్లి, పాములపర్తి రిజర్వాయర్‌ల నిల్వ సామర్థ్యాన్ని భారీగా పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అదనపు నీటి నిల్వలకు వెసలుబాటు లభించనుంది. దీనిపై సోమవారం శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చే యనున్నారు. మరోపక్క కేంద్ర జల సంఘం(సీడబ్ల్యుసీ) లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర అధికారులు సోమవారం సంఘం చైర్మన్ ఏపీ పాండ్యాతో భేటీ కానున్నారు.

 ఎత్తు పెంపునకు ఓకే!
 ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల మండల పరిధిలో ఉన్న తుమ్మిడిహెట్టి గ్రామంలో నిర్మించదలిచిన బ్యారేజీ ఎత్తును 152 మీటర్లుగా నిర్ణయించడాన్ని ముంపు ప్రాంతాలపై అధ్యయనం చేసిన సీడబ్ల్యు సీపీఆర్‌ఎస్ సంస్థ సమర్థించింది. 152 మీటర్ల ఎత్తు బ్యారేజీతో మహారాష్ట్రలో ఏ ఒక్క గ్రామం ముంపునకు గురికాదని, కేవలం 1300ల నుంచి 1500ల ఎకరాలు మాత్రమే ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించిన తుది నివేదికను రెండు రోజుల కిందట ప్రభుత్వానికి అందజేసింది. బ్యారేజీ ఎత్తును 150 మీటర్ల వరకు తగ్గించాలన్న మహారాష్ట్ర ప్రతిపాదనను ఆ సంస్థ తోసిపుచ్చింది. ప్రస్తుత నివేదికతో మహారాష్ట్ర ప్రాంతంలో ప్రాజెక్టు కింద అవసరమైన భూముల సేకరణ ప్రక్రియ వేగిరం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూముుకు ఆ రాష్ట్ర చట్టాలను అనుసరించే పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన సమ్మతి తెలిపింది. దీనికితోడు ప్రాజెక్టు నిర్మాణంలో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో కోల్పోతున్న సుమారు 7వేల ఎకరాల అటవీ భూమికి సమాన భూమిని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇప్పటికే సర్వే ద్వారా గుర్తించి అందుకు సంబంధించిన నివేదికలను రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన అధికారికి అందించింది. రాష్ట్ర అటవీ శాఖ తుది పరిశీలన అనంతరం ఒకటి, రెండు రోజుల్లో ఈ నివేదిక కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు వెళ్లనుంది.

 రెండు రిజర్వాయర్‌ల నిల్వ సామర్థ్యం పెంపు
 ఇదిలా ఉండగా ప్రాణహితపై మెదక్ జిల్లాలో నిర్మించదలిచిన తడ్కపల్లి, పాములపర్తి రిజర్వాయర్‌ల నిల్వ సామర్ధ్యం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 160 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రాణహిత నదిపై పెద్దగా రిజర్వాయర్‌లు లేని దృష్ట్యా, ఈ రిజర్వాయర్‌ల సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాణహిత నదిపై కేవలం ఎల్లంపల్లి(20.17టీఎంసీలు), మిడ్‌మానేరు(25.175టీఎంసీలు) మినహాయిస్తే మధ్యలో నిర్మించదలిచిన మేడారం ఎత్తిపోతల, మోతే, అనంతగిరి, తిప్పారం రిజర్వాయర్‌లన్నీ తక్కువ నిల్వ సామర్థ్యం కలిగినవే. ఈ దృష్ట్యా తడ్కపల్లి రిజర్వాయర్‌ను 1.5టీఎంసీల నుంచి 30 టీఎంసీలకు, పాములపర్తిని 1 టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం సంకల్పించింది.

 నేడు సీడబ్ల్యుసీ చైర్మన్‌తో అధికారుల భేటీ..
 ప్రాజెక్టుపై వస్తున్న పలు అభ్యంతరాలపై చర్చించేందుకు సోమవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు సీడబ్ల్యుసీ చైర్మన్ ఏబీ పాండ్యాతో ఢిల్లీలో మరోమారు భేటీ కానున్నారు. 1941 నుంచి ప్రస్తుతం వరకు గోదావరి నదీ జలాల లభ్యతపై కూడిన గణాంకాలతో అధికారులు పాండ్యాకు వివరణ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.40వేల కోట్లపైనా అధికారులు చైర్మన్ లేవనెత్తే సందేహాలకు సమాధానాలు ఇవ్వనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement