సాక్షి, హైదరాబాద్: సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తప్పిదంతో గ్రూప్–1 (2011 నోటిఫికేషన్) ఫలితాల్లో తారుమారైన అభ్యర్థుల ప్రాధాన్యతలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సవరించింది. అక్టోబర్ 28న ప్రకటించిన ఫలితాల్లో ప్రాధాన్యతలు తారుమారయ్యాయంటూ అభ్యర్థులు ఫిర్యాదు చేయడంతో వాటిని ఉపసంహరించుకున్న టీఎస్‌పీఎస్సీ...పూర్తిస్థాయి పరిశీలన అనంతరం సవరించిన ఫలితాలను శనివారం విడుదల చేసింది. దీని ప్రకారం గతంలో కేటాయించిన పోస్టులతో పోలిస్తే తాజా జాబితాలో 48 మంది అభ్యర్థులకు అత్యుత్తమ పోస్టులు లభించాయి. గత జాబితాలో ఉన్న పది మందికి తాజా జాబితాలో చోటు దక్కలేదు. పోస్టింగ్‌లు మారడం, మారిన పోస్టుకు సంబంధించి రోస్టర్‌లో అభ్యర్థులు ఫిట్ కాకపోవడంతో వారి పేర్లను తొలగించారు.
వారిలో ఇద్దరు అభ్యర్థులు ఎంపీడీఓ పోస్టుకు అర్హత సాధించినప్పటికీ ఆప్షన్లు ఇవ్వకపోవడంతో పోస్టులు కేటాయించలేదు. అదేవిధంగా కొత్తగా మరో పది మందికి అవకాశం కలిగింది. తాజాగా ఎంపికైన అభ్యర్థులు సాధించిన మార్కులు, సామాజికవర్గం, ఆప్షన్లు తదితర వివరాలు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. తొలుత విడుదల చేసిన ఫలితాల్లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫలితాల జాబితా తప్పులతడకగా మారిపోయింది.
టాప్ ర్యాంకర్లకు ప్రాధాన్యంలేని పోస్టులు దక్కగా.. దిగువన ఉన్నవారికి ప్రాధాన్యమున్న పోస్టులు లభించాయి. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తామిచ్చిన ఆప్షన్లకు, వచ్చిన పోస్టుకు సంబంధం లేదంటూ పలువురు అభ్యర్థులు తగిన ఆధారాలతో సహా టీఎస్‌పీఎస్సీకి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన టీఎస్‌పీఎస్సీ పొరపాట్లు దొర్లినట్లు గుర్తించింది. మొత్తం 127 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా... చివరకు 238 మంది అభ్యర్థులను మౌఖిక పరీక్షలకు పిలిచారు. వారికి తుది పరీక్షలు నిర్వహించి 121 పోస్టులు భర్తీ చేశారు. మరో 6 పోస్టులు దివ్యాంగుల కేటగిరీవి కావడం.. సరైన అభ్యర్థులు లేకపోవడంతో ఆ పోస్టులను టీఎస్‌పీఎస్సీ క్యారీ ఫార్వర్డ్ చేసింది.
48 మందికి మెరుగైన పోస్టులు
Published Sun, Nov 12 2017 3:58 AM | Last Updated on Sun, Nov 12 2017 3:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment