
గాంధీ ఆస్పత్రిలో గవర్నర్‌కు చికిత్స!
హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం సాధారణ పౌరుడిలా గాంధీ ఆస్పత్రిని సందర్శించి చికిత్స చేయించుకున్నారు. తన కుడి పాదంపై అయిన కాయను గురించి గాంధీ వైద్యుల సలహా తీసుకున్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ శ్రావణ్‌కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ నరసింహారావు నేత, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ జయకృష్ణ తదితరులు గవర్నర్ వెంట ఉన్నారు.
గవర్నర్ పాదాన్ని పరిశీలించిన ప్లాస్టిక్ సర్జరీ హెచ్‌వోడీ సుభోద్, జనరల్ సర్జన్ వీఎన్ రెడ్డి.. గాంధీ ఆస్పత్రిలో చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రిలోని పరిశుభ్రతపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపర్చాలని, రోగులకు మరింతగా వైద్యం అందించేలా మెరుగుపడాలని సూచించారు. ఈ సందర్భంగా రోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆస్పత్రిలో మరో ఎమ్మారై యూనిట్‌ను ఏర్పాటుచేయాల్సిన అవసరముందని గాంధీ వైద్యులు కోరగా.. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సలహా ఇస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు.