
రెండోరోజూ ‘గాంధీ’కి గవర్నర్
- వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు
- రక్త నమూనాలు సేకరణ
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ వరుసగా రెండో రోజూ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి వచ్చారు. కుడికాలి మడమకు ఆనె(కార్న్)తో బాధపడుతున్న ఆయన బుధవారం సాధారణ రోగిలో గాంధీ ఆస్పత్రికి వచ్చిన విషయం తెలిసిందే. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి చిన్నపాటి శస్త్రచికిత్స చేసి ఆనెను తొలగించాలని సూచించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ ఆస్పత్రికి వచ్చిన గవర్నర్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్‌కుమార్, వైద్యనిపుణులు సాదరంగా ఆహ్వానించి ప్రధాన భవనం నాల్గవ అంతస్థులోని సెంట్రల్ లెబోరేటరీకి తీసుకువెళ్లారు.
శస్త్రచికిత్సకు ముందు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించారు. రక్త నమూనాలు సేకరించారు. ఈసీజీ, 2డీ ఎకో తదితర వైద్యపరీక్షలు చేశారు. అర్ధగంట తర్వాత గవర్నర్ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. అనంతరం డాక్టర్ శ్రవణ్‌కుమార్, డిప్యూటీ నర్సింహారావు నేత, ఆర్‌ఎంవో 1 జయకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ కాలి మడమ ఆనె (కార్న్)ను తొలగించేందుకు శస్త్రచికిత్స అవసరమని, ఆపరేషన్‌కు ముందు ఫిట్‌నెస్ కోసం చేయాల్సిన వివిధ రకాల వైద్యపరీక్షలు నిర్వహించామని చెప్పారు. శాంపిల్స్ సేకరించి లెబోరేటరీలో నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని అన్నారు. నిర్ధారణ పరీక్షల నివేదికలు అందిన తర్వాత గవర్నర్‌తో చర్చించి ఎప్పుడు శస్త్రచికిత్స చేయాలనేది నిర్ణయిస్తామని తెలిపారు.
నేను ఫిట్‌గానే ఉన్నా....
అన్నిరకాల వైద్యపరీక్షల అనంతరం మీరు ఫిట్‌గానే ఉన్నారు, ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. ‘నేను ఫిట్‌గానే ఉన్నానని నాకు తెలుసు, మీ పరికరాలు, యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకే వచ్చా’అంటూ గవర్నర్ చమత్కరించారు.