సాక్షి, హైదరాబాద్: బీరు, విస్కీ, బ్రాందీ.. ఇలా మద్యం ఏదైనా ఓ రకమైన వాసన వస్తుంది.. అదోరకమైన చేదు రుచితో ఉంటుంది. కాస్త మందెక్కువైతే... తలపోటు, వికారం దగ్గరి నుంచి ఒళ్లు నొప్పులు, మగతగా ఉండటం దాకా ఎన్నో సైడ్ ఎఫెక్టులు. అయితే త్వరలో రాష్ట్ర మార్కెట్లోకి రానున్న విదేశీ ‘బయో మద్యం’ఇలాంటి సైడ్ ఎఫెక్టులన్నింటికీ అతీతమట. వాసన కూడా రాకపోవడం దాని ప్రత్యేకత అని, పలు రకాల ఔషధ ఉత్పత్తులను కలిపి దీనిని తయారు చేస్తున్నామని తయారీదారులు చెబుతున్నారు. తెలంగాణలో ఈ మద్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది. అయితే ఈ బయో మద్యంలోనూ సాధారణ మద్యంలో ఉండే స్థాయిలోనే ఆల్కాహాల్ ఉంటుంది. వాసన రాకపోవడం, సైడ్ ఎఫెక్టులు లేకపోవడం తప్ప మిగతా అంతా సాధారణ మద్యం లాగానే ఉంటుంది. తాగేసి వాహనం నడిపితే ‘డ్రంకెన్ డ్రైవ్’లో దొరికిపోవడం ఖాయమే.
తెలుగువారి కంపెనీయే
వాస్తవానికి గుంటూరుకు చెందిన సింధూరా హెర్బల్స్ సంస్థ వ్యవస్థాపకుడు అమర్‌నాథ్ బయో మద్యాన్ని తయారు చేశారు. దీనిని ఇక్కడి మార్కెట్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని శాస్త్రీయపరమైన సందేహాలను నివృత్తి చేయలేకవటంతో... బయో మద్యం ఇక్కడి మార్కెట్‌లోకి రాలేదు. తరువాత ఈ బయో మద్యానికి విదేశీ హంగులు జోడించి అమెరికా, నేపాల్ మార్కెట్లలో ప్రవేశపెట్టారు. తాజాగా రాష్ట్రంలో విదేశీ మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం, జీఈఎస్ సదస్సు నేపథ్యంలో ఇక్కడి మార్కెట్‌పై దృష్టి పెట్టారు. ఇక్కడ మద్యం మార్కెట్ తీరు, వినియోగంపై ఒక సర్వే చేయించినట్లు తెలిసింది. వాసన లేని, తలపట్టేయడం, వికారం వంటి సైడ్ ఎఫెక్టులు లేని మద్యానికి మంచి మార్కెట్ ఉన్నట్లు గుర్తించి.. తెలంగాణలో విక్రయాల కోసం కేఎస్ బయో నాచురల్స్ మార్కెటింగ్ సంస్థ పేరుతో దరఖాస్తు చేసుకున్నారు. ఈ మద్యం తాగితే నిషా వస్తుందిగానీ.. తలపట్టడం వంటి సైడ్ ఎఫెక్టులు ఉండవని, వాసన రాదని ఆ సంస్థ ప్రభుత్వానికి నివేదించి అనుమతి పొందింది. ప్రస్తుతం బయో బీరు, బయో విస్కీలకు అనుమతి వచ్చింది. త్వరలోనే బయో ఓడ్కా, బ్రాందీ, రమ్‌లను కూడా తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది.
ఏం కలుపుతారు?
విదేశాల్లో మొక్కజొన్నలు, బార్లీ, జొన్నలు వంటి ధాన్యం ఆధారంగా తయారు చేసిన ఆల్కాహాల్ ఈఎన్‌ఏ (ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్)కు చక్కెరను మండించి తయారు చేసిన ‘బరంట్ షుగర్’ను, ప్రత్యేక కృత్రిమ (సింథటిక్) ఫ్లేవర్లను కలిపి మద్యాన్ని తయారు చేస్తారు. మన దేశంలో మొలాసిస్ ఆధారిత ఈఎన్‌ఏను వాడుతారు. అదే బయో మద్యంలో బరంట్ షుగర్ స్థానంలో తేనె ఆధారిత చక్కెరను, అశ్వగంధ లాంటి 16 రకాల మూలికలను కలిపి సహజ ఫ్లేవర్లతో మద్యాన్ని ఉత్పత్తి చేస్తామని కంపెనీ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌కు సమర్పించిన బ్రాండ్ లేబుల్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులో పేర్కొంది.
విదేశీ మద్యం అమ్మకాలు పెరిగే అవకాశం
ప్రస్తుతం రాష్ట్రంలో 500 రకాల విదేశీ మద్యం బ్రాండ్లు ఉన్నాయి. ఏటా 280 లక్షల కేసుల దేశీ మద్యం అమ్ముడుపోతుండగా.. లక్ష కేసుల మేర విదేశీ మద్యం విక్రయిస్తున్నారు. విదేశీ మద్యం నుంచి సుమారు రూ.2,890 కోట్ల మేర రాబడి వస్తోంది. తాజాగా బయో మద్యంతో విదేశీ మద్యం అమ్మకాలు పెరుగుతాయని.. రాబడి మరో వెయ్యి కోట్ల వరకు పెరుగుతుందని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రత్యేకత ఏమీ లేదు
హైదరాబాద్‌లో తరచుగా అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు జరుగుతున్నందున విదేశీ మద్యానికి డిమాండ్ పెరుగుతోంది. ఆ క్రమంలోనే ఇటీవల 58 విదేశీ మద్యం బ్రాండ్లకు అనుమతించాం. అందులో బయో మద్యం ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అంతేగానీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ మద్యాన్ని ప్రోత్సహించడం లేదు..
– టీఎస్‌బీసీఎల్ చైర్మన్ దేవీప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment