
జిల్లా స్థాయి ఉద్యోగాల భర్తీపై ఫోకస్
- తక్షణ అవసరమున్న పోస్టులకు నోటిఫికేషన్లు
- విద్య, వైద్యం, పోలీసు, పురపాలక, పంచాయతీరాజ్‌లకు మొదటి ప్రాధాన్యం
- రెండో దశలో జోనల్, మల్టీ జోనల్ నియామకాలు
- ఖాళీలు, భర్తీ ప్రక్రియపై సీఎస్ సమీక్ష
- 3 రోజుల్లోగా సమగ్ర నివేదికలివ్వాలని ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తొలి విడతగా జిల్లా స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. రెండో దశలో జోనల్, మల్టీ జోనల్ పోస్టుల నోటిఫికేషన్లు జారీ చేయాలని యోచిస్తోంది. ఇరు రాష్ట్రాలకు ఉద్యోగాల విభజన పూర్తయ్యే వరకు రాష్ట్ర స్థాయి పోస్టుల నియామకాలను పెండింగ్‌లో పెట్టాలని నిర్ణయించింది.
జూలై నుంచి నోటిఫికేషన్ల జారీకి కసరత్తును వేగిరం చేసింది. విద్య, వైద్యం, పురపాలక, పంచాయతీరాజ్, హోం శాఖల్లోని ఖాళీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఆయా విభాగాల్లో ఉన్న జిల్లాస్థాయి పోస్టులెన్ని.. అందులో మొదటి విడతగా భర్తీ చేయాల్సినవి ఎన్ని.. తదితర వివరాలతో సమగ్ర నివేదికను రెండు మూడు రోజుల్లో ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్‌శర్మ సంబంధిత కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం 5 విభాగాల కార్యదర్శులతో పాటు ఆర్థిక శాఖ అధికారులతో సీఎస్ సమావేశం ఏర్పాటు చేశారు. జోనల్, మల్టీ జోనల్ పోస్టుల ఖాళీల వివరాలనూ విడిగా అందించాలని సూచించారు.
విద్యాశాఖలో రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మందికి పైగా ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సి ఉంది. పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణ కారణంగా ఈ నియామకాలు ఆలస్యమవనున్నాయి. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న మిగతా పోస్టుల వివరాలు సేకరిస్తున్నారు. అత్యధికంగా పోలీసు విభాగంలో 12 వేలకు పైగా ఖాళీలున్నాయి. కానిస్టేబుల్ మొదలు ఎస్‌ఐల వరకు రిక్రూట్‌మెంట్ చేయాల్సి ఉంది. వీటిపై సమావేశంలో చర్చ జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫార్మసిస్టులు, టెక్నీషియన్ పోస్టుల వరకు తొలుత భర్తీ చేసే అవకాశముంది. ఆ వివరాలతో పాటు కొత్త పీహెచ్‌సీలు, అప్‌గ్రేడ్ అయిన పీహెచ్‌సీల్లో ఉన్న ఖా ళీల వివరాలను అందించాలని సీఎస్ సూచిం చారు. దాదాపు వెయ్యి పోస్టుల వరకు తక్షణం భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు బదులిచ్చారు.
50 వేలకు చేరిన ఖాళీలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేసే సమయంలో 17,960 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఫైలు సిద్ధం చేసింది. 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం చెప్పటంతో ఆర్థిక శాఖ అందుకు సన్నాహాలను ముమ్మరం చేసింది. సీఎస్ రాజీవ్ శర్మ అన్ని విభాగాల కార్యదర్శులతో సమావేశమై ఆగమేఘాలపై ఖాళీల వివరాలను అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఖాళీల సంఖ్య దాదాపు 50 వేలకు చేరినట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.
అందులో ఏ పోస్టులను ముందు భర్తీ చేయాలి... వీటిలో వేటిని టీఎస్‌పీఎస్‌సీ ద్వారా రిక్రూట్ చేయాలి, ఏ పోస్టులను డిపార్టుమెంటల్ బోర్డుల ద్వారా చేపట్టాలి, జిల్లా స్థాయి సెలెక్షన్ కమిటీకి వేటిని అప్పగించాలనే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విభాగాల వారీగా అధికారులతో సమావేశమై తక్షణ ప్రాధాన్యంగా భర్తీ చేయాల్సిన పోస్టులు, వాటికి అర్హతలు, ఎంపిక విధానంపై చర్చిస్తున్నారు. ప్రతిపాదనలన్నీ సిద్ధమయ్యాక ఉద్యోగాల భర్తీ ఫైలును సీఎంకు నివేదించనున్నారు.