భూపాలపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి అధ్వానంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి పట్టణంలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఆదివారం శాసన సభాపతి మధుసూదనాచారితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించాయన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి చూస్తే బాధాకరంగా ఉందని, బీదలకు వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. మండల కేంద్రాల్లో 30, నియోజకవర్గ కేంద్రాల్లో 100, జిల్లా కేంద్రాల్లో వేయి పడకల ఆస్పత్రుల ఏర్పాటుకు కృషి చేస్తోందన్నారు.