రూసా కింద ఏడు ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రతిపాదనలు
మండలిలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, రాజయ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చే సేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య తెలిపారు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానమిస్తూ ఈ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్ (రూసా) పథకం కింద రాష్ట్రంలో ఏడు ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. కేంద్రం అనుమతిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి జిల్లాకో ప్రభుత్వ ఇం జనీరింగ్ కళాశాల ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాల విషయంలో రాజీపడేది లేదని స్పష్టంచేశారు. విద్యాశాఖను నాన్ వెకేషన్ డిపార్ట్‌మెంట్‌గామార్చాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేసే అంశంకూడా ప్రభుత్వపరిశీలనలో ఉందన్నారు.
వచ్చే ఏడాది వరంగల్ వర్సిటీలో అడ్మిషన్లు
వరంగల్‌లో కాళోజీ నారాయణరావు పేరిట హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిందని, వచ్చే ఏడా ది నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి రాజయ్య చెప్పారు. కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలోనే 126 ఎకరాల స్థలంలో ఈ హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పుతామన్నారు. రాష్ట్రంలో డెంగీ జ్వరాలు నమోదైనప్పటికీ ఒక్క మరణం కూడా సంభవించలేదన్నా రు. ఎక్కడా మందులు, సిబ్బంది కొరత లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికే ఆరోగ్యశ్రీకి నిధులను తగ్గించామన్నారు. వైఎస్ హయాంలో ప్రైవేటు ఆసుపత్రుల కోసమే ఆరోగ్యశ్రీ పెట్టారని ఆరోపణలు వచ్చాయని మంత్రి అనడంతో... ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు కొందరు ఎ మ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత రాజయ్య మాట్లాడుతూ... వైఎస్ మహానుభావుడని, ఆయన పెట్టిన పథకం అమలుపై ఆరోపణలొచ్చాయే గానీ, పథకం ఎంతోమంది పేదలకు మేలు చేకూర్చిందని వివరించారు.
85 శాతం కొలువులు స్థానికులకే: కేటీఆర్
ఐటీ కంపెనీల్లో 85 శాతం సెమీస్కిల్డ్, అన్‌స్కిల్డ్ ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేందుకు పలు సం స్థలు సానుకూలత వ్యక్తం చేశాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదిభట్లలో టీసీఎస్ సంస్థ 28 వేల మంది ఉద్యోగులు పనిచేసే సామర్థ్యం గల ఐటీ కంపెనీని ఏర్పాటు చేసిందని, అందులో స్థానికులకు అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు వివరించారు.
విత్తన భాండాగారంగా రాష్ర్టం: పోచారం
తెలంగాణను దేశానికే విత్తన భాండాగారంగా మార్చేందుకు చర్యలు చేపట్టామని వ్యవసాయ మంత్రి పి.శ్రీనివాసరెడ్డి చెప్పారు. పంటలకు నాణ్యమైన విత్తనాలను తయారు చేసేలా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రణాళికలు రచిస్తోందన్నారు. మూతపడిన సీడ్ ఫామ్స్‌ను తెరిపిస్తామని, పది హెక్టార్లు యూని ట్‌గా సీడ్ విలేజ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.
జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాల!
Published Tue, Nov 25 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM
Advertisement