
రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు
మన్మథ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.
- హాజరైన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, కేసీఆర్, చంద్రబాబు
- ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు
- గవర్నర్ శుభాకాంక్షలు
- పజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి: కేసీఆర్
- తెలుగు ప్రజలంతా ఉజ్వల భవిష్యత్ సాధించాలి: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: మన్మథ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, తెలంగాణ, ఏపీ సీఎంలు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ముగ్గురు అతిథులను ఆత్మీయంగా సత్కరించారు. ఇరు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారందరికీ గవర్నర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కూడా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది వేడుకల ద్వారా గవర్నర్ చక్కని సంప్రదాయానికి శ్రీకారం చుట్టారంటూ ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణలో తొలి ఉగాది పండుగను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని, కొత్త ఏడాదిలో తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. జయ నామ సంవత్సరంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి, కొత్త రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర సత్వర అభివృద్ధికి ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ... తెలుగు ప్రజల మధ్య విడదీయలేని అనుబంధం ఉందని బాబు పేర్కొన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా, ఉజ్జ్వల భవిష్యత్‌ను సాధించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో భాగంగా శృంగేరీ ఆస్థాన పండితుడు సంతోష్‌కుమార్ పంచాగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పలు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, పేరిణి నృత్యం అందరినీ ఆకట్టుకున్నాయి.
రెండు దశాబ్దాల అనుబంధం: కలాం
తెలుగు రాష్ట్రాలతో తనకు రెండు దశాబ్దాల అనుబంధం ఉందని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నారు. ప్రజలందరికీ ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 1970లో శ్రీహరికోటలో పనిచేయటంతో పాటు.. 1982 నుంచి పదేళ్లపాటు హైదరాబాద్‌లోని డీఆర్‌డీఏలో శాస్త్రవేత్తగా పనిచేసిన తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అగ్ని, పృథ్వీ క్షిపణుల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడే రూపొందించినట్లు చెప్పారు.
సుఖశాంతులతో వర్ధిల్లాలి..
తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభలో ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క తదితరులు శుభాకాంక్షలను తెలియజేశారు. తెలుగు ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.
అంతులేని ఆనందం నిండాలి
తెలుగు వారికి వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
తెలుగువారి తొలి పండుగ, తెలుగు నూతన సంవత్సరం అయిన ఉగాది అందరి జీవితాల్లోనూ అంతులేని ఆనందం తీసుకురావాలి. రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ ఏడాదంతా సుఖ శాంతులతో వర్థిల్లాలి. కొత్త సంవత్సరంలో సమృద్ధిగా వానలు కురిసి రాష్ర్టం సుభిక్షంగా ఉండాలి.