బాగున్నారా! | Govind waghmare given some tips to Hygiene | Sakshi
Sakshi News home page

బాగున్నారా!

Published Mon, Dec 15 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM

బాగున్నారా!

బాగున్నారా!

ఆరోగ్యం కాపాడుకోవడానికి మొదట పరిశుభ్రతను పాటించాలి. వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి. వివిధ వ్యాధులు, వాటితో కలిగే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఏర్పడినా సమీపంలోని ఆరోగ్యకేంద్రానికిగానీ, ఆస్పత్రికిగానీ వెళ్లాలి. అక్కడ మా వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. వైద్య సేవలు, సలహాలు అందిస్తారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు పెరుగకుండా చూసుకోవాలి. ఇంటిలోనూ, వసతి గృహాలలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగుంటాయి.
 
నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలోని బాలికల వసతి గృహం అది. ఆదివారం పగలు 12 గంటల సమయం. జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోవింద్ వాగ్మారే ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా అక్కడికి చేరుకున్నారు. విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో గంటసేపు మాటామంతీ జరిపారు. బాలికల ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు. యోగ, క్షేమాలను విచారించారు. చక్కగా చదువుకోవాలని, వ్యాధులపై అవగాహన పెంచుకోవాలని వారికి సూచించారు. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజెప్పారు. విద్యార్థినులు కూడా ఆయనను పలు ప్రశ్నలు అడిగి తమ సందేహాలను తీర్చుకున్నారు. ఈ వసతి గృహంలో ఆర్మూర్, కామారెడ్డి, నందిపేట్, నవీపేట్, డిచ్‌పల్లి, ఎడపల్లి తదితర ప్రాంతాలకు చెందిన 311 మంది విద్యార్థినులు ఉన్నారు. వారంతా ఇంటర్, డిగ్రీ చదువుతున్నారు.
 
 వైద్యాధికారి :  నీ పేరేమిటి?
 ప్రియాంక : నా పేరు ప్రియాంక. నేను గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న.
 వైద్యాధికారి :  ఏ గ్రూప్ చదువుతున్నవు?
 ప్రియాంక : మైక్రో బయాలజీ రెండవ సంవత్సరం చదువుతున్న.
 వైద్యాధికారి : నీకు వ్యాధులపై అవగాహన ఉంటుంది కదా..క్రిములు, దోమలతో కలిగే అనర్థాలు తెలిసే ఉంటాయి కదా!
 ప్రియాంక : అవును సార్
 వైద్యాధికారి : దోమలతో వచ్చే వ్యాధుల పేర్లు చెప్పు?
 ప్రియాంక : మెదడువాపు, డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా వస్తాయి సార్.
 వైద్యాధికారి : వెరీ గుడ్
 వైద్యాధికారి : నువ్వేం చదువుతున్నవు. ఏ కాలేజీ?
 అలేఖ్య : నేను గిరిరాజ్ కళాశాలలో సైన్స్ గ్రూప్‌లో విద్యనభ్యసిస్తున్నా.
 వైద్యాధికారి : వివిధ వ్యాధులతో కలిగే ఇబ్బందులపై అవగాహన ఉందా?
 అలేఖ్య : ఉంది సార్.
 వైద్యాధికారి : బోధకాలు నివారణ మాత్రలు వేసుకున్నారా?
 రజనీ : కొందరు వేసుకున్నారు, కొందరు వేసుకోలేదు సార్.
 వైద్యాధికారి : మాత్రలు వేసుకోనివారెవరు?
 నాగలక్ష్మి (వార్డెన్) : కొందరు విద్యార్థులు భోజనం చేయలేదు సార్, భోజనం చేసిన తరువాత వేసుకుంటారు.
 వైద్యాధికారి : ఇది చాలా ముఖ్యమైన విషయం. భోజనం చేసిన తరువాతే మాత్రలు వేసుకోవాలి. అనంతరం విశ్రాంతి తీసుకోవాలి.
 శిల్ప : మాత్రలు వేసుకుంటే ఏం కాదా?
 వైద్యాధికారి : ఎలాంటి ప్రమాదమూ ఉండదు. మాత్రలు వేసుకుంటే ముందస్తుగానే బోధకాలు వ్యాధిని నివారించవచ్చు.
సౌమ్య : గతంలో ఎప్పుడూ ఈ మాత్రలు హాస్టళ్లలో ఇవ్వలేదు.
 వైద్యాధికారి : అది తెలిసే, ఈసారి తప్పనిసరి గా మీకు మాత్రలు అందించాలని మా సిబ్బందిని ఇక్కడికి పంపించాను. అవును హాస్టళ్లలో ఉంటున్నారు కదా.. మీ ఆరోగ్యాలు ఎలా ఉంటున్నాయి. మీకు ఆరోగ్య సమస్యలు వస్తే ఎక్కడికి వెళుతున్నారు?
 సుహాసినీ: మాకు ఆరోగ్య సమస్యలు వస్తే మా వార్డెన్‌ను సంప్రదిస్తాం. వారు దగ్గరుండి వైద్యం అందేలా చూస్తారు.
 వైద్యాధికారి : మీకు ఎలాంటి సమస్యలున్నా, పక్కనే అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. అక్కడికి వెళ్లండి. మా వైద్య సిబ్బంది కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.
 అపర్ణ : వ్యాధులలో డెంగీ ఎందుకు ప్రమాదకరమైంది?
 వైద్యాధికారి : డెంగీతో రక్తంలోని సెల్స్, ప్లేట్‌లెట్స్ పడిపోతాయి. దీంతో రక్తం తక్కువై నీరసించిపోతారు. వైద్య సహాయం అందకుంటే చనిపోయే ప్రమాదం ఉంది. ఆడ ఎనాఫిలిస్ దోమతో డెంగీ వ్యాపిస్తుంది. అందుకే దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వసతి గృహంలో దోమలు లేకుండా చూసుకోండి.
 నాగలక్ష్మి (వార్డెన్): విద్యార్థినులు దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హాస్టల్‌లోని పరిసరాలను ఎప్పుడు కప్పుడు శుభ్రం చేయిస్తుంటాం.
 వైద్యాధికారి : విద్యార్థినులు ఉండే గదులు శుభ్రంగా ఉంచుకోవాలి. కిటీకీలకు దోమ తెరలను ఏర్పాటు చేసుకోవాలి. దోమకాటు బారిన పడకుండా జాగ్రత్తపడాలి.
 సంధ్య: విరేచనాలు ఎందుకు వస్తాయి?
 వైద్యాధికారి : కలుషిత ఆహారం తిన్నా, కలుషిత నీరు తాగినా విరేచనాలు అవుతాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలి. లేదంటే మా వైద్య సిబ్బంది మీకు అందుబాటులో మాత్రలు కూడా ఉంచుతారు.
 విద్యార్థినులు : అలాగే సార్.
 వైద్యాధికారి : మీరు ఇంటికి దూరంగా ఉంటున్నారు. ఆడపిల్లలు కదా ఇంటివైపు ఆలోచన ఉండదా?
 మౌనిక : మేము వసతి గృహంలో ఉంటే ఇంటి వైపు ధ్యాస ఉండదు. స్నేహితులందరం కలిసి చక్కగా ఉంటాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు ఉంటారు. సమిష్టిగా చదువుకుంటాం. కబుర్లు చెప్పుకుంటాం.
 సుజాత: సెలవులు వస్తే ఇంటికి వెళ్తాం. అప్పుడప్పుడు మా తల్లిదండ్రులు ఇక్కడికి వస్తారు.
 వైద్యాధికారి : వచ్చినప్పుడు ఏం చేస్తారు. వంటకాలు తీసుకొస్తారా?
 రాణి : తీసుకొస్తారు. ఆదివారం ప్రత్యేకంగా వంటకాలు తీసుకొస్తారు.
 వైద్యాధికారి : వ్యాధుల నివారణకు సంబంధిం చి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. వాటితో కలిగే నష్టాలు తెలుసుకోవాలి. చదువుతో పాటు వీటిపై కూడా దృష్టి సారించాలి. అప్పుడే ఆరోగ్యాలు బాగుంటాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement