స్నాతకోత్సాహం   | Graduation Ceremony In Sangareddy | Sakshi
Sakshi News home page

స్నాతకోత్సాహం  

Published Mon, Aug 6 2018 9:57 AM | Last Updated on Mon, Aug 6 2018 9:57 AM

Graduation Ceremony In Sangareddy - Sakshi

స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్రపతి దంపతులతో గవర్నర్, మంత్రి హరీశ్‌రావు, ఐఐటీ బోధన సిబ్బంది

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఐఐటీ హైదరాబాద్‌ ఏడో స్నాతకోత్సవం ఆదివారం కందిలోని ఐఐటీహెచ్‌ ప్రాంగణంలో సందడిగా సాగింది. ఐఐటీహెచ్‌ పదో వసంతంలోకి అడుగు పెట్టడంతో విద్యార్థులు, సిబ్బంది ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పట్టా సర్టిఫికెట్లు అందుకునేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పండుగ వాతావరణం కనిపించింది. స్నాతకోత్సవానికి హాజరైన విద్యార్థులు, బోధన సిబ్బంది, అతిథులు భూదాన్‌ పోచంపల్లి చేనేత కార్మికులు ఇక్కత్‌ డిజైన్‌లో రూపొందించిన జకార్డ్‌ వస్త్రాలు ధరించారు.

బీటెక్, ఎమ్మెస్సీ, ఎంటెక్, ఈఎండీఎస్, ఎండీఈఎస్, ఎంఫిల్, ఎంఎస్, పీహెచ్‌డీ తదితర కోర్సులకు సంబంధించి మొత్తం 566 మంది విద్యార్థులు స్నాతకోత్సవంలో ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ యూబీ దేశాయ్‌ చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు. పట్టాలను అందుకునేందుకు విద్యార్థులు క్రమశిక్షణతో బారులు తీరడం ఆకట్టుకుంది. పట్టాలు అందుకున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులు, స్నేహితులు అభినందనల్లో ముంచెత్తారు.

క్యాంపస్‌ను వీడుతున్న విద్యార్థులు తమ స్నేహితులతో జ్ఞాపకాలను పదిలపరుచుకునేందుకు సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ కేరింతలు కొట్టారు. బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనిబరిచిన నలుగురు విద్యార్థులకు రాష్ట్రపతి కోవింద్‌ బంగారు పతకాలు ప్రదానం చేశారు. బంగారు పతకం అందుకున్న వారిలో వికారాబాద్‌కు చెందిన కొడుగుంట స్నేహారెడ్డి అనే విద్యార్థినికి ఓ ఐటీ కంపెనీలో కోటి రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగం వచ్చినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు.

ప్రముఖుల రాకతో సందడి

స్నాతకోత్సవానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరవుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గవర్నర్‌ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు తదితరులు రాష్ట్రపతికి హెలిప్యాడ్‌ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ యూబీ దేశాయ్‌ నేతృత్వంలోని అధ్యాపక బృందం.. రాష్ట్రపతి దంపతులో పాటు అతిథులను వేదిక వరకు ఊరేగింపుగా తోడ్కొని వచ్చాయి.

ఐఐటీహెచ్‌ పాలక మండలి చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేయగా, ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ దేశాయ్‌ ప్రగతి నివేదిక చదివారు. అతిథులకు ప్రొఫెసర్‌ దేశాయ్‌ జ్ఞాపికను అందజేయగా, రాష్ట్రపతికి ఐఐటీ అసిస్టెంట్‌ చంద్రశేఖర్‌ రూపొందించిన ప్రత్యేక మెమెంటోను అందజేశారు. ఇందులో సిలికాన్‌తో తయారు చేసిన ప్రత్యేక చిప్‌ను అమర్చి, ఐఐటీ ఫొటోలు, వివరాలను నమోదు చేశామని ప్రొఫెసర్‌ దేశాయ్‌ రాష్ట్రపతికి వివరించారు.

రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. లోనికి వచ్చే వారిని విస్తృతంగా తనిఖీల అనంతరం అనుమతించారు. స్నాతకోత్సవానికి జెడ్పీ చైర్‌పర్సన్‌ రాజమణి మురళీ యాదవ్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జేసీ నిఖిల, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నరహరిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు మనోహర్‌గౌడ్‌ తదితరులు హాజరయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement