
ధాన్యం కొనుగోలు చేస్తున్న దృశ్యం (ఫైల్)
మెదక్‌జోన్: ‘ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోకండి .. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించండి’ అని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ధాన్యం విక్రయించి నెలరోజులు గడిచిపోతున్నా డబ్బులు రైతుల ఖాతాల్లో జమకావడం లేదు. ఓవైపు ఖరీఫ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు పెట్టుబడి ఎలా అంటూ అన్నదాతలు వాపోతున్నారు. జిల్లాలో ఈయేడు రబీ సీజన్‌లో సాగుచేసిన పంటల్లో సగం ఎండిపోయాయి.
చాలామంది రైతుల బోర్లలో నీటిఊటలు అడుగంటిపోయి కనీసం పెట్టిన పెట్టుబడి సైతం రాలేదు. సాగుచేసిన దాంట్లో సగం పంట మాత్రమే చేతికందింది. ఏప్రిల్ 24న జిల్లాలో 114 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జూన్ 26వ తేదీ వరకు నెలరోజుల పాటు ధాన్యం కొనుగోళ్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 18,686 మంది రైతుల నుంచి 66,629 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. క్వింటాల్ ధాన్యానికి మద్దతు ధర రూ. 1,770 చొప్పున రూ.116.89 కోట్లు అవుతుంది. ఇందులో ఇప్పటి వరకు రైతులకు రూ.76.89 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.40కోట్లు ఇవ్వాల్సి ఉంది. ధాన్యం అమ్మి నెలరోజులు గడిచిపోతుండడంతో రైతులు డబ్బుల కోసం నిత్యం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
36గంటల్లో డబ్బులేవీ?
కొనుగోలు చేసిన 36 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయంటూ అధికారులు చెప్పినా ఆచరణలో సాధ్యం కాలేదు. కొందరు రైతులు ధాన్యం విక్రయించి 20 రోజులు, మరికొంత మంది అమ్మి 15 రోజులు అవుతున్నా నేటికీ ఖతాల్లోకి డబ్బులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.
ఖరీఫ్ పెట్టుబడి ఎలా?
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో విత్తనాలు, ఎరువులు, ముందస్తుగా కొంటారు. ధాన్యం డబ్బులు చేతికందకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఏటా ఖరీఫ్ ప్రారంభం కాగానే గ్రామాల్లో సాగుచేసిన పంటల దిగుబడి అధికంగా రావాలనే ఉద్దేశంతో పశువులపేడ, కోడి ఎరువు, చెరువుల్లోని నల్లమట్టి తదితర వాటిని పంటపొలాల్లో చల్లుతారు. వీటికి ఎకరాకు సుమారు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు చేస్తుంటారు. ఇవి పొలంలో వాడితే అధిక దిగుబడి రావడంతో పాటు సేంద్రియ ఎరువులతో పొలంలో మంచి గ్రోత్ ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటన్నింటినీ ముందస్తుగా సిద్ధం చేసుకుందామంటే రైతులకు డబ్బులు సకాలంలో అందాల్సి ఉంది. ఇప్పటికైనా తమకు రావాల్సిన డబ్బులకు వెంటనే ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు.
వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి..
ఈఏడు రైతులకు డబ్బులు చెల్లించడంలో ఆలస్యం అయిన మాట వాస్తవమే. ధాన్యం కొనుగోళ్లు కాగానే క్రమసంఖ్య పద్ధతిలో ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది. ఉన్నతాధికారుల సమాచారం మేరకు మరో వారం రోజు ల్లో డబ్బులు రైతుల ఖాతాల్లోకి రానున్నాయి. – ఈశ్వరయ్య, ఇన్‌చార్జి డీసీఓ
Comments
Please login to add a commentAdd a comment