కూటమి మిత్రుత్వంలో జిల్లాలోని దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. క్షణానికో తీరుగా సమీకరణాలు మారడంతో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఆశావహులు ఆందోళనకుగురవుతున్నారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కూడా షురూ కావడంతో ఉత్కంఠకు లోనవుతున్నారు. పార్టీ టికెట్ రాకపోతే ఏం చేయాలని అనుచరుల ద్వారా కేడర్‌తో సంప్రదింపులు చేసే పనిలో ఉన్నట్లు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా.. లేదా ఏదో ఒక పార్టీ గుర్తుతో పోటీలో నిలవాలా.. ఎలా అయితే లాభదాయకంగా ఉంటుందోనని అంచనాలు వేస్తున్నారు.
సాక్షి, సిద్దిపేట: పొత్తులో భాగంగా దుబ్బాక సీటును తెలంగాణ జనసమితికి అప్పగించడం దాదాపు ఖరారు కావడంతో కాంగ్రెస్ నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. మాజీ మంత్రి ముత్యం రెడ్డి చివరి వరకు టికెట్ కోసం పోరాటం చేశారు. అనుచరులతో చెప్పించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఏం చేస్తే బాగుంటుందని అనుచరుల వర్గం అభిప్రాయ సేకరణలో పడినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుండి నేటి వరకు ప్రజల మధ్యలోనే ఉన్నాం.. వృద్ధాప్యంలో చివరిసారి పోటీ చేసి రాజకీయాల నుండి విరమించుకుంటారని ప్రచారం కూడా చేశారు. కానీ ఆ అవకాశం కాంగ్రెస్ పెద్దలు ఇస్తున్నట్టు కనిపించడం లేదు. దీంతో కేడర్‌లో నిరుత్సాహం నింపకుండా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటే ఎలా ఉంటుందోనని లెక్కలు వేస్తున్నారు. అదేవిధంగా తనకున్న పరిచయాలతో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో మాట్లాడి టీజేఎస్ తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు కూడా తెలిసింది.
స్వతంత్రంగా మద్దుల..?
అదేవిధంగా ఇంతకాలం స్వచ్ఛంద సంస్థ ద్వారా పనిచేసి.. బెంగళూరు వంటి పట్టణాల్లో వ్యాపారపరంగా అభివృద్ధి చెందిన మద్దుల నాగేశ్వర్‌రెడ్డి.. చివరి వరకు టీఆర్‌ఎస్ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే ఆ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి ఇవ్వడంతో భంగపాటుగా భావించిన నాగేశ్వర్‌రెడ్డి వెంటనే తన అనుచరుల ద్వారా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరిపారు. టికెట్ తెచ్చుకోవడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ చివరకు ఇక్కడ కూడా చేదు అనుభవం ఎదురైంది. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా లేదా.. మరో పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉండాలని భావిస్తున్నట్ల తెలిసింది. ఇందుకు కేడర్ కూడా సై అంటుందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
కూటమిలో హుస్నాబాద్ చిచ్చు..
టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ధ్యేయంగా ఏర్పాటైన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల కూటమిలోనే హుస్నాబాద్ టికెట్ చిచ్చు పెడుతోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించేది హుస్నాబాద్ నుండే. ఆ పార్టీ అడిగే స్థానాల్లో ఇది కీలకం. అయితే ఈ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డికి ఇచ్చేందుకు టీపీసీసీ అధినాయకత్వం అంగీకరించినట్లు తెలిసింది. అయితే చివరి నిమిషం వరకు పట్టుపట్టిన సీపీఐ ఆ టికెట్ రాకపోతే కూటమి నుండి వైదొలిగేందుకు కూడా సిద్ధమే అన్నట్లు తేల్చి చెప్పినట్లు తెలిసింది. తర్వాత ఈ టికెట్ సీపీఐకి ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది.
ఇద్దరూ పోటా పోటీగా ప్రచార రథాలు ఏర్పాటు చేసుకొన్నారు. అయితే ఆదివారం ప్రవీణ్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లి తిరిగి అధినాకత్వంతో మాట్లాడి పోటీ చేస్తానని తేల్చి చెప్పినట్లు తెలిసింది. దీంతో వారు కూడా ప్రచారం చేసుకోమని చెప్పినట్లు ప్రచారం. దీంతో విషయం తెలుసుకున్న చాడ.. సోమవారం ఢిల్లీ పెద్దలను కలిసి ఈ సీటు విషయంపై తాడోపేడో తెల్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఇప్పటి వరకు ఈ సీటుపంచాయితీ ఇంకా తెగకుండా అయ్యింది. అయితే ఇక్కడ పొత్తులు పెట్టుకున్న ప్రతిసారీ పరిస్థితి ఇంతే ఉంటుందని అక్కడి నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్లు ఎవరికి వచ్చినా స్నేహ పూర్వక పోటీగా ఇరు పార్టీలకు చెందిన నాయకులు పోటీలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
గరం.. గరం
Published Tue, Nov 13 2018 1:00 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment