‘లెక్క’ తేల్చుతారు! | Granted under the command of government to recognize bogus schemes homes | Sakshi
Sakshi News home page

‘లెక్క’ తేల్చుతారు!

Published Sun, Jul 13 2014 12:47 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

‘లెక్క’ తేల్చుతారు! - Sakshi

‘లెక్క’ తేల్చుతారు!

ప్రభుత్వ పథకాల కింద మంజూరైన ఇళ్లలో బోగస్‌లను గుర్తించాలని కేసీఆర్ ఆదేశం
 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పేదల కోసం ప్రభుత్వ నిధులు, సబ్సిడీలతో నిర్మించిన ప్రతి ఇంటినీ ప్రభుత్వం లెక్కతీయనుంది. ప్రభుత్వ పథకాల కింద నిర్మించిన మొదటి ఇంటితో సహా ఇప్పటివరకు మంజూరైన అన్ని ఇళ్ల వివరాలను సేకరించనుంది. ఇందుకోసం గూగుల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనుంది. అసలు మం జూరైన ఇళ్లెన్ని? అందులో నిర్మించినవెన్ని? పక్కదారిపట్టినవెన్ని? దుర్వినియోగమైన నిధులెన్ని అనేది తేల్చనుంది. అక్రమాలు బయటపడితే.. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టడంతో పాటు నిధులనూ రికవరీ చేయనుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పథకాల కింద పేదల కోసం 45 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది. దీనికి ప్రభుత్వం రూ. 9,400 కోట్లు ఖర్చు చేసింది. వీటికి సంబంధించిన వివరాలన్నీ పైకి పక్కాగా కనిపిస్తున్నా... వాస్తవానికి భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. పేదలకు ఒక్కో ఇంటిని రూ. మూడు లక్షలతో విశాలంగా నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీ నేపథ్యంలో.. ముందుగా ఈ అక్రమాల బాగోతం తేల్చాలని నిర్ణయించింది.

లక్షల ఇళ్లు ఎక్కడికి పోయాయి..?

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి కేసీఆర్ వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించి కొన్ని విస్తుపోయే అంశాలు ఆయన దృష్టికి వచ్చాయి. దాంతో ఆయన అలాంటి మొత్తం ఇళ్ల వివరాలను ఆరా తీయాలని నిర్ణయించి.. అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు .బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గతంలో నిర్వహించిన థర్డ్ పార్టీ తనిఖీల వివరాలు కేసీఆర్ దృష్టికి వచ్చాయి. తెలంగాణలో 593 గ్రామాల్లో నిర్వహించిన ఈ పరిశీలనలో ఏకంగా రూ. 230 కోట్ల వరకు అక్రమాలు జరిగాయన్నది ఆ నివేదిక సారాంశం. ఈ లెక్కన అన్ని గ్రామాల్లో పరిశీలన చేస్తే భారీ అక్రమాలు వెలుగుచూసే అవకాశముందని కేసీఆర్ అధికారులకు సూచించారు.

 తెలంగాణలో మొత్తం 84 లక్షల కుటుంబాలున్నాయి. వారంతా దాదాపు 57 లక్షల ఇళ్లలో నివాసం ఉంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తం ఇళ్లలో 45 లక్షల ఇళ్లు ప్రభుత్వపరంగా పేదల కోసం నిర్మించినవే. అంటే సాధారణ కుటుంబాలుండే ఇళ్లు 12 లక్షలు మాత్రమే అన్నట్లు. అంతేగాకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉండగా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి గతేడాది చివరలో 13.65 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికితోడు మరికొన్ని లక్షల మంది దరఖాస్తుకు సిద్ధంగా ఉన్నారు.

 ఈ పరిస్థితిని పరిశీలించిన కేసీఆర్... ఇప్పటికే ప్రభుత్వ పరంగా 45 లక్షల ఇళ్లు నిర్మించినా... మళ్లీ లక్షల కొద్దీ ఇళ్ల కోసం దరఖాస్తులెందుకు? అన్ని ల క్షల మంది ఇళ్లు లేకుండా ఎందుకున్నారు? అన్న కోణంలో పరిశీలించి, వాస్తవాలు వెలికితీయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా చంద్రబాబునాయుడు హయాంలో తెలుగుదేశం నేతలు, అధికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించే నాటికి ప్రతి ఇంటి లెక్కను తన ముందుం చాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఊరికి వెళ్లి పరిశీలిం చి పారదర్శకమైన నివేదిక ఇవ్వాల ని కోరారు. ఈ మేరకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.
 
ఏం చేయబోతున్నారు..?

ప్రభుత్వ నిధులు, సబ్సిడీలతో నిర్మించిన పేదల ఇళ్లకు సంబంధించిన లెక్కలను ఆగస్టు 14వ తేదీలోగా సేకరించాలి. ఈ లక్ష్యం మేరకు వేగంగా పనిచేయాలని అధికారులకు గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలు జారీ చేశారు. గత శనివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ పది జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ ఇళ్ల లెక్క తేల్చాలని నిర్ణయించారు.

గూగుల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, వాస్తవాలను వెలికితీయాలి. ఆ ఇంటి ఫొటో సహా యజమాని వ్యక్తిగత వివరాలు, ప్రభుత్వం అందజేసిన మొత్తం తదితర అన్ని వివరాలను గూగుల్ మ్యాపుల్లో నిక్షిప్తం చేయాలి. ఈ పరిశీలనలో బోగస్‌ల జాడ తెలిస్తే బాధ్యులైన అధికారులెవరో గుర్తించి, వారిపై ఆరోపణలు నమోదు చేయాలి. నిధులను రికవరీ చేయాలి.
 దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న ఈఈలు, డిప్యూటీ ఈఈలను మరో జిల్లాకు.. ఏఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్లను మరో నియోజకవర్గానికి బదిలీ చేయాలి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement