ఢమాల్స్ | Greater economic activity Arrested | Sakshi
Sakshi News home page

ఢమాల్స్

Published Mon, Nov 3 2014 4:41 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

ఢమాల్స్ - Sakshi

ఢమాల్స్

గ్రేటర్‌లో స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలు మెట్రో ప్రాజెక్టుకు శాపంలా పరిణమించాయి. అంచనాలు తలకిందులు కావడం, జీహెచ్‌ఎంసీ నుంచి...

  • మెట్రోకారిడార్లలో బడా వాణిజ్య సంస్థల నిర్మాణంపై డోలాయమానం
  •  అదనంగా రూ.1,500 కోట్ల వీజీఎఫ్ నిధులు కోరుతున్న ఎల్‌అండ్‌టీ
  •  నిర్మాణ పరమైన అనుమతుల్లోనూ జాప్యం
  • సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలు మెట్రో ప్రాజెక్టుకు శాపంలా పరిణమించాయి. అంచనాలు తలకిందులు కావడం, జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన అనుమతులు జాప్యం కారణంగా కారిడార్లలో బడామాల్స్ నిర్మాణంపై ఎల్‌అండ్‌టీ సంస్థ డోలాయమానంలో పడింది. పూర్తి స్థాయి ఆక్యుపెన్సీపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రవాణా ఆధారిత అభివృద్ధి(ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్‌కు)కి కేంద్రం నుంచి అదనంగా రూ.1,500 కోట్ల సర్దుబాటు నిధులు (వయబిలిటీ గ్యాప్ ఫండింగ్) కోసం యత్నాలు చేస్తోంది.
     
    ఎర్రమంజిల్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, అమీర్‌పేట్ ప్రాంతాల్లో తొలివిడతగా ఎల్‌అండ్‌టీ నిర్మించాలనుకున్న భారీ మెట్రో షాపింగ్ మాల్స్‌కు నాటి ఉమ్మడి ఏపీ సర్కార్ స్థలాలను కేటాయించింది. మెట్రో ప్రాజెక్టు తొలిదశ పూర్తయ్యే నాటికే సుమారు 60 లక్షల చదరపు మీటర్ల మేర బడా మెట్రో మాల్స్ (వాణిజ్య స్థలాలు) నిర్మించాలని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ 2010 సెప్టెంబరు 4కు ముందే (ఒప్పందం కుదిరిన రోజు) నిర్ణయించింది. దశలవారీగా 2017 నాటికి 18.5 మిలియన్ చదరపు మీటర్ల స్థలాల్లో వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేయాలన్నది సంస్థ లక్ష్యం.

    తొలివిడత చేపట్టాలనుకున్న మాల్స్‌కు జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన నిర్మాణ పరమైన అనుమతులు ఆలస్యమవుతుండడం, మరోవైపు తాము తొందరపడి మాల్స్ నిర్మించినప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో భర్తీ (ఆక్యుపెన్సీ) చేసే అవకాశం ఉంటుందా? అన్న అంశంపై సదరు సంస్థ ప్రస్తుతం డోలాయమానంలో పడినట్లు సమాచారం.

    ఈ నేపథ్యంలో మెట్రో కారిడార్లలో రవాణా ఆధారిత అభివృద్ధి (ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్‌కు)కి కేంద్రం నుంచి అదనంగా రూ.1,500 కోట్ల సర్దుబాటు నిధులు (వయబిలిటీ గ్యాప్ ఫండింగ్) రాబట్టేందుకు తమకు సహకరించాలని ఎల్‌అండ్‌టీ సంస్థ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవించినట్లు సమాచారం. ఇదే అంశంపై చర్చించేందుకు ఎల్‌అండ్‌టీ సంస్థలో ఉన్నత స్థాయి చైర్మన్ ఏఎం నాయక్ త్వరలో సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నట్లు తెలిసింది.
     
    రూ.1,500 కోట్ల వీజీఎఫ్ నిధుల కోసం  పట్టు..

    మెట్రో ప్రాజెక్టుకు గతంలో కేంద్ర ప్రభుత్వం రూ.1,458 కోట్లు వీజీఎఫ్ (సర్దుబాటు నిధులు) మంజూరు చేసింది. రాష్ట్ర విభజన తరువాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మెట్రో కారిడార్లలో రవాణా ఆధారిత ప్రాజెక్టులు, మాల్స్ అభివృద్ధికి అదనంగా మరో రూ.1,500 కోట్లు కేటాయించాలని ఎల్‌అండ్‌టీ సంస్థ పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఈ విషయంలో కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని కోరుతున్నట్లు సమాచారం. ప్రస్తుత తరుణంలో మెట్రో ప్రాజెక్టును పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా మరికొన్ని ప్రభుత్వ స్థలాలు, వాణిజ్య ప్రకటన పన్ను మినహాయింపు వంటి రాయితీలు కావాలని ఎల్‌అండ్‌టీ తెలంగాణ సర్కార్‌ను కోరుతుండడం గమనార్హం.
     
    మెట్రోనా.. రియల్టీ ప్రాజెక్టా..?

    అందరూ పైకి చెబుతున్నట్లుగా మహానగర మెట్రో రైలు ప్రాజెక్టు కేవలం ప్రయాణికులకు అత్యుత్తమ ప్రయాణ సాధనమే కాదు... ఇది ముమ్మాటికీ రియల్టీ ప్రాజెక్టేనన్న వాదనలు తెరపైకి వచ్చాయి. దేశంలో తొలిసారిగా పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంలో (పీపీపీ) విధానంలో చేపడుతున్న ఈ  ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.12,674  కోట్లను ఎల్‌అండ్‌టీ సంస్థ పలు జాతీయ బ్యాంకుల నుంచి రుణంగా సేకరించి వ్యయం చేస్తోంది. నాలుగేళ్లుగా సుమారు రూ.5 వేల కోట్లు ఖర్చు చేసింది.

    ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ చేసే వ్యయాన్ని దశలవారీగా సమకూర్చుకునేందుకు నాటి ఉమ్మడి ప్రభుత్వం.. ఒప్పంద పత్రంలో నగరం నడిబొడ్డునున్న ప్రధాన  ప్రాంతాల్లో రూ.కోట్లు విలువచేసే 269 ఎకరాలప్రభుత్వ స్థలాలను నిర్మాణ సంస్థకు కట్టబెట్టింది. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.3,380 కోట్లు ఉంటుందని ఓ అంచనా. ఇంత విలువైన స్థలాలను సుమారు 60 ఏళ్లపాటు ఎలాంటి లీజు లేకుండా సదరు సంస్థకు కట్టబెట్టడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతుండడం గమనార్హం.
     
    269 ఎకరాల్లో 57 ఎకరాల్లో రియల్టీ ప్రాజెక్టులే..

    నాగోల్-శిల్పారామం, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా రూట్లో మొత్తం 72 కిలోమీటర్ల మార్గంలో మెట్రో ప్రాజెక్టు నిర్మితమవుతున్న విషయం విదితమే. ఈ కారిడార్ల పరిధిలో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీకి నాటి ఉమ్మడి ప్రభుత్వం 269 ఎకరాల ప్రభుత్వ స్థలాలను కేటాయించింది. ఇందులో 57 ఎకరాల్లో వాణిజ్య స్థలాలు, మాల్స్, కార్పొరేట్ సంస్థలు కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా బహుళ అంతస్తుల భవంతులను నిర్మించి బడా కార్పొరేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అంటే మొత్తం సంస్థకు కేటాయించిన స్థలాల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు రూపేణా 57 ఎకరాల స్థలాన్ని వినియోగించాలన్నది నిర్మాణ సంస్థ లక్ష్యం. అంటే మియాపూర్ మెట్రో డిపోకు కేటాయించిన 104 ఎకరాల స్థలంలో 99 ఎకరాలు డిపో అవసరాలకు వినియోగించనున్నారు. మరో ఐదు ఎకరాల్లో రియల్టీ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు.

    ఇక ఉప్పల్ మెట్రో డిపోకు నాగోల్‌లో కేటాయించిన వంద ఎకరాల స్థలంలో 97 ఎకరాల్లో డిపో, మరో మూడు ఎకరాల్లో వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేయాలని నిర్మాణ సంస్థ సంకల్పించింది. ఫలక్‌నుమా ప్రాంతంలో 17 ఎకరాల స్థలంలో 80 శాతం స్థలంలో మెట్రో డిపో, మరో 20 శాతం స్థలంలో వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేయనుంది. ఇక అమీర్‌పేట్, పంజగుట్ట, ఎల్బీనగర్, ఓల్డ్ గాంధీ ఆస్పత్రి, రాయదుర్గం, నాంపల్లి, బాలానగర్, పరేడ్ గ్రౌండ్స్, ఎర్రమంజిల్, మలక్‌పేట్, యూసుఫ్‌గూడా, ఎంజీబీఎస్, కూకట్‌పల్లి, హైదర్‌నగర్ ప్రాం తాల్లోనూ వాణిజ్యస్థలాల ఏర్పాటుకు వీలుగా నిర్మాణ సంస్థకు స్థలాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలాలకు గాను నిర్మాణ సంస్థ (ఎల్‌అండ్‌టీ) నుంచి సుమారు 60 ఏళ్లపాటు ఎలాం టి లీజు మొత్తాన్ని వసూలు చేయరాదని ఒప్పంద పత్రంలోని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
     
    డైలమా ఇక్కడే..

    మెట్రో ప్రాజెక్టులో ప్రయాణికుల చార్జీల ద్వారా వచ్చే ఆదాయం కేవలం 45 శాతం మాత్రమే. మిగతా 55 శాతం రెవెన్యూ రియల్టీ ప్రాజెక్టులే ఆధారమంటే అతిశయోక్తి కాదు. మూడు మెట్రో కారిడార్లలో సుమారు 57 ఎకరాల్లో చేపట్టబోయే వాణిజ్య స్థలాల అభివృద్ధి, రవాణా వసతిసదుపాయాల కల్పన, మాల్స్ నిర్మాణంతో వచ్చే లీజులు, అద్దెల రూపేణా మాత్రమే నిర్మాణ సంస్థకు ఆదాయం సమకూరనుంది. రాష్ట్ర విభజనకు ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు.

    గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఆర్థిక కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. రియల్టీ, టూరిజం, నిర్మాణరంగం తదితర మఖ్యమైన రంగాల్లో ప్రస్తుతం స్తబ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో మాల్స్ నిర్మిస్తే వాటికి కార్పొరేట్ సంస్థల ఆదరణ ఉంటుందా..? తమ లక్ష్యం నెరవేరి ఆశించిన స్థాయిలో రెవెన్యూ ఆదాయం లభిస్తుందా? అన్న అంశంపై నిర్మాణ సంస్థ మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇదే అంశంపై తాజాగా మరోమారు లెక్కలు వేసుకుంటుందని తెలిసింది.
     
    నిర్మాణ అనుమతుల్లోనూ జాప్యమే..

    తొలివిడతగా ఎర్రమంజిల్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, అమీర్‌పేట్ ప్రాంతాల్లో నిర్మించాలనుకున్న మెట్రో మాల్స్ నిర్మాణానికి సంబంధించి ఏడాదిగా జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన నిర్మాణపరమైన అనుమతులు, అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు అందడం లేదు. దీంతో వీటి నిర్మాణం కూడా డైలమాలోనే పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement