వివరాలు వెల్లడిస్తున్న దానకిశోర్. చిత్రంలో సీపీ అంజనీకుమార్
సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ యంత్రాంగం సిద్ధమైంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు అవసరమైన ఈవీఎంలు, సామగ్రి, శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లపై మంగళవారం ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు విస్తృత ప్రచారంచేస్తున్నట్టు చెప్పారు. వంద ప్రాంతాల్లో హోర్డింగులు, బస్టాప్‌లలో ఓటుహక్కుపై ప్రచారం చేశామన్నారు. ఐటీ, కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులంతా పోలింగ్‌కు హాజరయ్యేందుకు ఆయా సంస్థల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 90 శాతానికి పైగా ఓటరు స్లిప్పులు పంపిణీ చేశామని, మిగతావారికీ అందజేస్తామన్నారు. ఓటరు స్లిప్పులు అందకపోయినా ఆందోళన వద్దని.. జాబితాలో పేరుంటే.. 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి చూపి ఓటు వేయవచ్చన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయ్యాక చిరునామాలో లేనివారు, చిరునామా మారినవారు, డూప్లికేట్లకు(ఏఎస్‌డీ) çసంబంధించిన జాబితా రిటర్నింగ్ అధికారుల వద్ద ఉంటుందన్నారు.
యాప్స్‌తో పోలింగ్ కేంద్రం వివరాలు
ఓటరు జాబితాలో పేరు, పోలింగ్ కేంద్రం, తదితర వివరాలను ‘మైజీహెచ్‌ఎంసీ’, ఎన్నికల సంఘం రూపొందించిన ‘నా ఓట్ ’ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చునని దానకిశోర్ తెలిపారు. జిల్లా పరిధిలోని 3,873 పోలింగ్ కేంద్రాల వద్ద లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంటుందని, దీని ద్వారా ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయన్నారు. ఎన్నికల విధుల కోసం 11,619 మంది పోలింగ్ ఆఫీసర్లతో పాటు మరో 20 శాతం (3100 మంది) రిజర్వులో ఉంచామన్నారు. అవసరాన్ని బట్టి ఔట్ సోర్సింగ్‌పై తీసుకుంటామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుశాఖ సీసీ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్లు విధుల్లో ఉంటారన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కనీస మౌలిక సదుపాయాలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఓ మహిళా పోలింగ్ కేంద్రం, రెండు మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. మోడల్ పోలింగ్ కేంద్రాల్లో మెరుగైన సదుపాయాలతో పాటు ఓటుహక్కుపై అవగాహన కల్పించే ఏర్పాట్లుంటాయన్నారు.
పోటీలో ఉన్న 313 మంది అభ్యర్థుల పేర్లు, గుర్తులతో ఎలాంటి పొరపాట్లు లేకుండా బ్యాలెట్ పత్రాలు ముద్రించామన్నారు. కొత్త ఓటర్లకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి వచ్చిన 1.91 లక్షల ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్)ల పంపిణీ పూర్తి కానుందన్నారు. దివ్యాంగుల కోసం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వీల్‌చైర్లు ఉంచామని, కోరుకున్న వారికి ఉచిత రవాణా సైతం కల్పిస్తామన్నారు. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఉదయం 6 నుంచి 6.45 గంటల మధ్య మాక్ పోలింగ్ ఉంటుందన్నారు. మహిళలకు సదుపాయంగా క్యూలో ఉన్న ఇద్దరు మహిళల తర్వత ఓ పురుషుడిని ఓటు వేసేందుకు లోనికి అనుమతించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. బురఖా వేసుకున్నవారిపై అనుమానం వస్తే గుర్తించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలోను సిబ్బందిలో ఓ మహిళ తప్పనిసరిగా ఉంటారన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో ఉన్నవారందరినీ ఓటు వేసేందుకు అనుమతిస్తామన్నారు. పోలింగ్ కేంద్రంలోకి మీడియా కెమెరాలను అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్‌రూమ్‌లకు రెండంచెల భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ సందర్భంగా ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ సమయంలో తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారన్నారు.
శాంతిభద్రతలకు పోలీస్ శాఖ సిద్ధం: కొత్వాల్
ఎన్నికలు సజావుగా జరిగేందుకు 21 కంపెనీల పోలీసు బృందాలు, సాయుధ బలగాలు విధుల్లో ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. సీఆర్‌పీఎఫ్ మహిళా బెటాలియన్లు, సశస్త్ర సీమబల్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ వీటిలో ఉన్నాయి. 24 గంటల పాటు పనిచేసే 12 చెక్‌పోస్టులతో పాటు అదనపు పికెట్‌లు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ తేదీ నాటికి అన్ని బలగాలు పూర్తిస్థాయిలో విధుల్లో ఉంటాయని ఆయన చెప్పారు. కమాండ్ కంట్రోల్‌రూమ్ నుంచి అన్ని ప్రాంతాల్లోని పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలించే ఏర్పాట్లు చేశామన్నారు. వాహనాల కదలికలపై నిఘా ఉంటుందని, దాదాపు యాభై షాడో బృందాలు, సర్వైలెన్స్ బృందాలు పనిచేస్తున్నాయన్నారు. ఇప్పటి దాకా రూ.23.81 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. మీడియా, సోషల్ మీడియాల్లో వచ్చే ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఆన్‌లైన్ ద్వారా డబ్బు ట్రాన్సాక్షన్లపై ఐటీ శాఖలో ప్రత్యేక విభాగం పనిచేస్తోందన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు హరిచందన, జయరాజ్ కెనెడి, విజయలక్ష్మి, జాయింట్ కమిషనర్ పంకజ, జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు.
⇔ జిల్లాలో మొత్తం ఓటర్లు: 40,57,488
⇔ ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు: 4,468
⇔ బ్యాలెట్ యూనిట్లు: 8,574
⇔ వీవీప్యాట్లు: 4,861
⇔ వికలాంగులకు రవాణా సదుపాయం కల్పించేందుకు రూపొందించిన ‘వాదా’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారు: 5,989సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్న ప్రాంతాలు: 532
⇔ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు : 1,404
⇔ ఘర్షణలకు అవకాశమున్న ప్రాంతాలు: 17
ఓటరు స్లిప్,ఎపిక్ కార్డు లేకున్నా..జాబితాలో పేరున్నవారు ఓటరు స్లిప్ అందనప్పటికీ, కొన్ని గుర్తింపుపత్రాలతో వచ్చి ఓటు వేయవచ్చు.
♦ పాస్‌పోర్టు
♦ డ్రైవింగ్ లైసెన్సు
♦ కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు,పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు/పీఎస్‌యూల్లో పనిచేసేవారి సర్వీసు ఐడీ కార్డులు
♦ బ్యాంక్/పోస్టాఫీస్ పాస్‌బుక్స్(ఫొటోలతో ఉన్నవి)
♦ పాన్‌కార్డు
♦ ఎన్‌పీఆర్ కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డు
♦ ఎంఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్‌కార్డు
♦ కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్‌కార్డు
♦ పెన్షన్ డాక్యుమెంట్ (ఫొటోతో)
♦ ఎన్నికల సిబ్బంది అందజేసినఅధీకృత ఓటరు స్లిప్
♦ ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీల గుర్తింపు కార్డు
♦ ఆధార్ కార్డు
Comments
Please login to add a commentAdd a comment