గ్రూప్‌–1 ఎంపిక జాబితా ఉపసంహరణ | Group-1 select list withdrawal | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 ఎంపిక జాబితా ఉపసంహరణ

Published Tue, Oct 31 2017 2:23 AM | Last Updated on Tue, Oct 31 2017 7:03 AM

Group-1 select list withdrawal

సాక్షి, హైదరాబాద్‌ :  గ్రూప్‌–1 (2011) ఎంపిక జాబితాను టీఎస్‌పీఎస్సీ ఉపసంహరించింది. శనివారం ప్రకటించిన పోస్టింగుల్లో తప్పిదాలున్నట్లు తెలియడంతో సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పోస్టులకు అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవడంలో సెంటర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) పొరపాటు చేయడంతో పోస్టింగులు మారిపోయాయి. టాప్‌ ర్యాంకర్లకు ప్రాధాన్యంలేనివి.. దిగువన ఉన్న వారికి ప్రాధాన్యమున్న పోస్టులు లభించాయి.

దీంతో తామిచ్చిన ఆప్షన్లకు, వచ్చిన పోస్టుకు సంబంధం లేకుండా ఉందని..టాప్‌ ర్యాంకు సాధించినా ప్రాధాన్యంలేని పోస్టు కేటాయించారని ఆప్షన్ల ఫారాలు టీఎస్‌పీఎస్సీ అధికారులకు చూపించి అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన టీఎస్‌పీఎస్సీ.. సీజీజీ అధికారులతో అత్యవసరంగా సమావేశమైంది. సీజీజీ జరిపిన కేటాయింపులు, అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లు పరిశీలించి పొరపాట్లు దొర్లినట్లు గుర్తించింది.

విషయాన్ని సీఎం కేసీఆర్, సీఎస్‌ ఎస్పీ సింగ్‌కు టీఎస్‌పీఎస్సీ తెలుపగా.. అభ్యర్థుల ర్యాంకులు, వారి ఆప్షన్లను లోతుగా పరిశీలించాలని, మాన్యువల్‌గా చూసి మళ్లీ పోస్టింగులు ఖరారు చేయాలని సూచించారు. దీంతో శనివారం వెల్లడించిన ఫలితాలను టీఎస్‌పీఎస్సీ నిలిపేసింది. ర్యాంకుల ప్రకారం 121 మందికి కేటాయించిన పోస్టింగులు, ఆప్షన్లు, రోస్టర్, రిజర్వేషన్లను మరోసారి సమీక్షించి ఒకట్రెండు రోజుల్లో మళ్లీ ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించింది. కాగా, ఈ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ పొరపాటు ఏమీ లేదని, సీజీజీలోనే పొరపాటు దొర్లినట్లు ప్రభుత్వం పేర్కొంది. తప్పిదాలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.  

టీఎస్‌పీఎస్సీ ప్రకటనలోని అంశాలివీ..
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఇచ్చిన వెబ్‌ ఆప్షన్లు, వారికి సంబంధించి సీజీజీ ఇచ్చిన సమాచారం ప్రకారం పోస్టులు కేటాయించాం. అయితే తామిచ్చిన ఆప్షన్ల ప్రకారం పోస్టింగ్‌లు రాలేదని సోమవారం ఇద్దరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దీంతో సీజీజీ డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్రనిమ్‌జే, డైరెక్టర్‌ విజయ్‌కరణ్‌రెడ్డితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వివరణ కోరాం. తామిచ్చిన సమాచారాన్ని (డాటా) మరోసారి పరీశిలించిన సీజీజీ .. పోస్టుల కోసం అభ్యర్థులు ఇచ్చిన వెబ్‌ ఆప్షన్ల ప్రాధాన్యాల్లో పొరపాట్లు దొర్లినట్లు పేర్కొంది. మొత్తం సమాచారాన్ని మరోసారి పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో 28న ఇచ్చిన ఎంపిక జాబితాను ఉపసంహరిస్తున్నాం. కొత్త జాబితాను తరువాత ప్రకటిస్తాం.


వారంలో మార్కుల వివరాలు
అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఇంటర్వ్యూకు హాజరైన వారి మార్కుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. తుది ఎంపిక జాబితా ప్రకటించాక వారం రోజుల్లో మార్కుల జాబితా ప్రకటిస్తామని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement