‘కొల్లాపూర్‌లో ఫ్యాక్షన్‌ నేర్పుతున్నారు’ | Group Of People Attack On Strong Room In Kollapur At Nagarkurnool | Sakshi
Sakshi News home page

కొల్లాపూర్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత

Published Thu, Jan 23 2020 2:37 PM | Last Updated on Thu, Jan 23 2020 3:22 PM

Group Of People Attack On Strong Room In Kollapur At Nagarkurnool - Sakshi

సాక్షి, కొల్లాపూర్‌: జిల్లాలో స్ట్రాంగ్‌రూంపై జరిగిన దాడిని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గురువారం ఆయన కొల్లాపూర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బుధవారం నాడు ఇండియన్‌ ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి పోటీ చేసిన కొంతమంది వ్యక్తులు స్ట్రాంగ్‌రూంపై దాడి చేశారని పేర్కొన్నారు. వారు ఇంక్‌ బాటిల్స్‌ తీసుకొని రావడం, కట్టెలతో సిబ్బంది, పోలీసులపై దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు.

కొల్లాపూర్‌లో ఫ్యాక్షన్‌ సంస్కృతిని నేర్పుతున్నారని హర్షవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాల్సిన వ్యక్తులు, ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులే దాన్ని కించపరచడం శోచనీయన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తూ.. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. తప్పులు చేస్తే అది నేనైనా, ఎవరైనా సరే చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. పోలీసులపై, అమాయకులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు.

కొల్లాపూర్‌లో ఉద్రిక్తత..
కొల్లాపూర్‌ పట్టణంలో నిన్న రాత్రి 10 గంటలకు ఆకస్మాత్తుగా కరెంట్‌ పోయింది. చెన్నపురావుపల్లి ఫీడర్‌లో జంపర్స్‌ కట్‌ అయ్యాయనే కారణంతో కరెంట్‌ నిలిచిపోయినట్లు విద్యుత్‌ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే కరెంట్‌ లేని సమయంలో బ్యాలెట్‌ బాక్సులు మారుస్తున్నారంటూ పుకార్లు రావటంతో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తమ అనుచరులతో కలిసి స్ట్రాంగ్‌రూం వద్దకు చేరుకున్నారు. బ్యాలెట్‌ బాక్సులు మార్చేందుకు కరెంట్‌ సరఫరా నిలిపివేశారంటూ ఆందోళనకు దిగారు. స్ట్రాంగ్‌రూం వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా.. పోలీసులు కొందరు నాయకులను స్ట్రాంగ్‌ రూం వద్దకు తీసుకెళ్లి సీల్‌ను చూపించారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో ఎస్‌ఐలు రాజు, రమేష్‌లకు గాయాలవగా, పోలీసుల వాహనాల అద్దాలు పగిలాయి.

దీంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. అంబేద్కర్‌ చౌరస్తా, స్కాలర్స్‌ స్కూల్‌కు వెళ్లేదారి, పాత పోస్టాఫీస్‌ ఏరియాలో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు అక్కడికి చేరుకుని.. పోలీస్‌ బలగాలను రప్పించారు. రోడ్ల వెంట గస్తీ ఏర్పాటు చేసి గుమిగూడిన నాయకులను చెదరగొట్టారు. ఆందోళన విషయాన్ని కలెక్టర్‌, ఎస్పీలకు చేరవేయడంతో వారు రాత్రి 12 గంటలకు కొల్లాపూర్‌కు వచ్చి స్ట్రాంగ్‌రూంను పరిశీలించారు. అర్ధరాత్రి వరకు కొల్లాపూర్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక బ్యాలెట్‌ బాక్సులు భద్రపర్చిన రూములకు వేసిన సీల్‌లు యథాతథంగా ఉన్నాయని, తప్పుడు వదంతులను నమ్మవద్దని కలెక్టర్‌ శ్రీధర్‌ అన్నారు.

చదవండి:

కొల్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌ వర్గపోరు..

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భద్రత పెంపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement