సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన పరిహారాన్ని కేంద్రం వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘కరోనా వల్ల ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. జీఎస్టీ వసూళ్లు భారీగా తగ్గాయి. కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం.. జీఎస్టీ నిధులు తగ్గితే ఆ నష్టాన్ని కేంద్రం భర్తీ చేస్తుందనే నిబంధన ఉంది. దీని ప్రకారం రాష్ట్రానికి ఆ 2 నెలలకు రూ.3,975 కోట్లు కేంద్రం ఇవ్వాలి’అని కోరారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 40 జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వంలోని కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ అయిన రూ.1.76 లక్షల కోట్ల ఐజీఎస్టీ æమొత్తాన్ని రాష్ట్రాలకు పంచాలని తెలంగాణ మొదటి నుంచీ డిమాండ్ చేస్తూ వచ్చిందని, దీనిపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా పరిస్థితుల్లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.2,800 కోట్లు విడుదల చేయాలని కోరారు.
మాకే తక్కువ పరిహారం..
దేశంలో అతి తక్కువ జీఎస్టీ పరిహారం పొందిన రాష్ట్రం తెలంగాణ అని, దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఆదాయ వృద్ధిలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 2017–18, 2018–19, 2019–20 సంవత్సరాల్లో రాష్ట్రం మంచి వృద్ధి సాధించిందన్నారు. కరోనా వల్ల ఏప్రిల్, మే నెలల్లో జీఎస్టీని భారీగా కోల్పోయిందని, ఈ ప్రభావం రాష్ట్రంలోని అన్ని రంగాలపై పడిందన్నారు. ఆదాయం పడిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లోనూ కోత విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన జీఎస్టీ పరిహారం రూ.3,975 కోట్లు జూన్‌లోనే ఇవ్వాలని మంత్రి కేంద్రాన్ని కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధులకు కోత పెట్టడం సరికాదని పేర్కొన్నారు. కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్‌కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ కుమారి, అదనపు కమిషనర్ లక్ష్మినారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment