జీఎస్టీకి ‘సాంకేతిక’ సమస్యలు
► వాణిజ్య పన్నుల అధికారులకు లాగిన్ ఐడీల్లేవు
► 12 మంది సీటీవోలకు పదోన్నతి, 13 మంది బదిలీలు
సాక్షి, హైదరాబాద్: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి 15 రోజులు దాటిపోయినా సాంకేతిక సమస్యలు మాత్రం ఎక్కడివక్కడే ఉన్నాయి. కనీసం రాష్ట్ర వాణిజ్య పన్నుల అధికారులు జీఎస్టీ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యే ఐడీలకు సంబంధించిన సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఒక్కో సర్కిల్ పరిధిలో రిజిస్ట్రేషన్ వ్యవహారాలు చూసే సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారుల (ఏసీటీవోలు)కు మాత్రమే లాగిన్‌లు వచ్చాయి.
అవి కూడా సర్వర్‌లు బిజీ అంటూ సతాయిస్తున్నాయి. దాంతో డీలర్ల రిజిస్ట్రేషన్లు చేయడమే గగనంగా మారింది. సమస్యకు ఢిల్లీ స్థాయిలో కూడా పరిష్కారం లభించకపోవడం, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రెడేషన్ పేరిట జాప్యం జరుగుతుండడంతో ఉన్నతాధికారులు తల పట్టుకుంటున్నారు. కనీసం జాబ్‌చార్టుకు కూడా ఆమోదం రాకపోవడంతో ఏ అధికారి ఏం చేయాలో కూడా స్పష్టత లేకుండా పోయింది.
విధుల కేటాయింపుల్లో స్పష్టత వస్తేనే...
జీఎస్టీ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ విధుల కేటాయింపే పరిష్కారం. కానీ సహాయ వాణిజ్య పన్నుల అధికారి (ఏసీటీవో) నుంచి కమిషనర్ దాకా ఎవరి విధులేమిటో ఇప్పటికీ స్పష్టత రాలేదు. జీఎస్టీ అమలు బాధ్యతను వాణిజ్య పన్నుల శాఖతో పాటు సెంట్రల్ ఎక్సైజ్‌కు కూడా కేంద్రం అప్పగించింది. సెంట్రల్ ఎక్సైజ్ అధికారులతో సమన్వయం కోసం వాణిజ్య పన్నుల అధికారుల హోదాలను మార్చాల్సి ఉంది.
సంబంధిత ప్రతిపాదనలతో కూడిన ఫైలును ప్రభుత్వానికి పంపినా ఇంతవరకూ ఆమోదం రాకపోవడంతో ఏ పనీ సాగడం లేదు. లాగిన్ ఐడీలు వచ్చినా హోదాల్లో స్పష్టత లేకపోతే పెద్దగా ఉపయోగం ఉండదంటున్నారు. 15 రోజులు దాటిన డీలర్ల రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ దరఖాస్తులన్నీ జీఎస్టీ చట్టం ప్రకారం వేలాదిగా వాటంతటవే ఆమోదం పొందాయి. లాగిన్ వచ్చాక వాటన్నింటినీ ఏకకాలంలో పరిశీలించడం సమస్యే కానుంది.
సమస్యలు పరిష్కరించండి: శ్రీనివాస్‌గౌడ్
సీటీవోలకు ప్రమోషన్లిచ్చినందుకు ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు టీజీవోలు ధన్యవాదాలు తెలిపారు. టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, రవీందర్ రావు, మధుసుదన్, కృష్ణయాదవ్, రాజ్ కుమార్ గుప్తా, వెంకటయ్య, బుగ్గప్ప, శ్రీనివాస్, రామ్ ప్రసాద్, పావని తదితరులు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే , టీజీవో చైర్మన్ వి.శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఆయన్ను కలిశారు. ఇతర శాఖాపరమైన సమస్యలనూ పరిష్కరించాలని కోరారు.
ఎట్టకేలకు పోస్టింగుల్లో కదలిక
చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న సీటీవోల పదోన్నతుల ఉత్తర్వులు మంగళవారం వెలువడ్డాయి. 12 మంది సీటీవోలకు అసిస్టెంట్ కమిషనర్లుగా ప్రమోషన్లిచ్చారు. మరో 13 మందిని బదిలీ కూడా చేశారు. దీంతో డీసీటీవోలు సీటీవోలుగా; ఏసీటీవోలు, డీసీటీవోలుగా పదోన్నతులు పొందే ప్రక్రియకు మార్గం సుగమం కానుంది. రిటైరైన వాణిజ్య పన్నుల అడిషనల్ కమిషనర్ రేవతి రోహిణి పోస్టు భర్తీకి కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం ఇద్దరు డిప్యూటీ కమిషనర్ల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.