హామీల అమలులో టీఆర్‌ఎస్ విఫలం
► కేంద్రం నిధులనే అభివృద్ధిగా చెప్పుకుంటున్న వైనం
► ఒక్కరోజు దీక్షలో సుగుణాకర్‌రావు
జమ్మికుంట : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు విమర్శించారు. పట్టణంలోని పాత అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఫల్యాలపై ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ప్రజల్లో ఆశలు రేపి ఓట్లు, సీట్లు పొంది అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చేసింది శూన్యమన్నారు. నీరు, నిధులు, ఉద్యోగాల పేరుతో సాధించుకున్న రాష్ట్రంలో రెండేళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులనే అభివృద్ధిగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు.
ఎందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారో, ఎంతమంది దళితులకు మూడెకరాలు పంపిణీ చేశారో చెప్పాలన్నారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని గొప్పలు పలికి.. ఒక్క ఎకరానికి కూడా నీరందించలేదన్నారు.పోలీసులు పక్షపాత దోరణి వీడాలని, బీజేపీ నిరసన దీక్షకు గాంధీచౌక్‌లో అనుమతులివ్వకపోవడంపై ప్రశ్నించారు. ఎర్రబెల్లి సంపత్‌రావు, ఆకుల రాజేందర్, జీడీ మల్లేశ్, రవిఠాకూర్, అప్పం మధు, తడిగొప్పుల శ్రీనివాస్, ఎగ్గటి హరీష్, బొనగాని శ్రీనివాస్, కైలాసకోటి గణేష్ తదితరులు పాల్గొన్నారు.