నిర్వాసితులకు గూడేదీ? | Gudedi displaced? | Sakshi
Sakshi News home page

నిర్వాసితులకు గూడేదీ?

Published Sun, Mar 22 2015 1:56 AM | Last Updated on Wed, Sep 5 2018 3:38 PM

నిర్వాసితులకు గూడేదీ? - Sakshi

నిర్వాసితులకు గూడేదీ?

  • 16 ప్రాజెక్టుల పరిధిలో 42 వేల మందికి పునరావాసం అంతంతే
  • ప్రధాన ప్రాజెక్టుల్లో మార్చికల్లా ప్రక్రియ పూర్తి కావాల్సినా కానరాని చర్యలు
  • అది పూర్తయితేనే ప్రాజెక్టులు ముందుకు కదిలేది
  • మిడ్‌మానేరు పరిధిలో ఇంకా 6 వేల మందికి అందని ఆర్ అండ్ ఆర్ పట్టాలు
  • దేవాదుల, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత కింద చేపట్టిన ప్రాజెక్టుల పరిధిలో సహాయ పునరావాసం (ఆర్ అండ్ ఆర్) ముందుకు కదలట్లేదు. నిర్వాసితులకు పట్టాల పంపిణీ మొదలుకొని గృహవసతి కల్పన వరకు చేపట్టాల్సిన పనుల పూర్తికి సర్కారు సత్వర చర్యలు తీసుకోవట్లేదు. నిర్ణీత కాలవ్యవధిలో వీటిని పూర్తి చేయకుంటే ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం కష్టతరమేనని ఉన్నతాధికారులే వాపోతున్నారు. నిర్వాసితులకు కొత్త కాలనీలు నిర్మించి, యుద్ధప్రాతిపదికన మౌలిక సదుపాయాలు కల్పిస్తే పునరావాస ప్రక్రియ వేగంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.                
    - సాక్షి, హైదరాబాద్
     
    పునరావాసం అంతంతే...

    సాగునీటి ప్రాజెక్టుల కింద ముంపునకు గురయ్యే గ్రామాలను ఖాళీ చేయించే క్రమంలో నిర్వాసితులకు ప్రభుత్వం కల్పించే సహాయ పునరావాసం అత్యంత కీలకమైనది. రాష్ట్రంలోని 16 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద మొత్తంగా 78 ముంపు గ్రామాలున్నాయని, 42,457 మంది నిర్వాసితులు ఉంటారని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ ఈ మార్చి నాటికే పునరావాసం పూర్తి కావాల్సి ఉన్నా అది జరగలేదు. ముఖ్యంగా మిడ్‌మానేరు ప్రాజెక్టు ద్వారా కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో సుమారు 2 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు సాగునీటిని అందించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తోంది.

    ఈ ప్రాజెక్టు కింద మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో 2,750 ఎకరాలు, కరీంనగర్‌లో 2,500 ఎకరాల మేర అవసరమవుతాయి. మొత్తంగా ప్రాజెక్టు కింద  23 ముంపు గ్రామాలుండగా అందులో మొదటివిడతగా ఈ ఏడాది మార్చి నాటికి 11 గ్రామాల్లో సహాయ పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. మొత్తంగా 11,123 మంది నిర్వాసితులను గుర్తించిన ప్రభుత్వం ఇందులో ఆర్ అండ్ ఆర్ కింద ఇప్పటిరవకు కేవలం 5,155 మందికి మాత్రమే పట్టాలను అందించింది. మరో 6 వేల మందికి ఈ ఏడాది చివరిలోగా పట్టాలు అందించి, వారికి కొత్తగా గృహ సముదాయాల ఏర్పాటుకు తగినన్ని నిధులు వెచ్చించాల్సి ఉంది.

    ఇక మరో 12 గ్రామాలకు పునరావాసానికి ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏఎంఆర్‌పీ ప్రాజెక్టు పరిధిలోని 5 గ్రామాల్లో 3,195 మంది నిర్వాసితులకు, ఎస్సారెస్పీ స్టేజ్-2 లోని 331 మందికి, దే వాదుల కింద 198 మందికి, ఎస్సారెస్పీ (స్టేజ్-1) కింద 13 ముంపు గ్రామాల పరిధిలోని 7,552 మంది నిర్వాసితులకు ఈ ఏడాదిలోగా సహాయ పునరావాసం కల్పించాల్సి ఉంది.
     
    వేర్వేరు ఆర్ అండ్ ఆర్ కమిషనర్‌లు!

    పునరావాస ప్రక్రియ నెమ్మదించిన కారణంగా ప్రాజెక్టు పనులు ముందుకు కదలకపోవడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. చిన్న నీటిపారుదలశాఖలో గోదావరి, కృష్ణా బేసిన్ చెరువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేందుకు వేర్వేరు చీఫ్ ఇంజనీర్‌లను నియమించిన మాదిరే..రెండు బేసిన్‌ల పరిధిలోని ప్రాజెక్టులకు వేర్వేరు ఆర్ అండ్ ఆర్ కమిషనర్‌లను నియమించి పర్యవేక్షణ జరపాలని భావిస్తోంది. దీనిపై సీఎం ఇప్పటికే ఓ నిర్ణయానికి సైతం వచ్చారని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
     
    మహబూబ్‌నగర్‌లో సగంలోనే..

    ఇక సహాయ పునరావాస సమస్యను ఎదుర్కొంటున్న మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు ప్రధానంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పాలమూరు ఎత్తిపోతల పథకం వచ్చి చేరింది. భీమా ప్రాజెక్టు కింద 8 గ్రామాల పరిధిలో 6,156, కల్వకుర్తి పరిధిలోని 258, నెట్టెంపాడు పరిధిలోని 2,640 మంది నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కింద పట్టాలు, ఇళ్లు నిర్మాణం జరిపించాల్సి ఉంది. ఇందులో ఎక్కువ ప్రాజెక్టు కింద సహాయ పునరావాసం ఈ ఏడాది మార్చిలోగా పూర్తి చేయాల్సి ఉంది. భీమా కింద సహాయ పునరావాసానికి మొత్తంగా రూ.92.34 కోట్ల మేర అవసరం ఉండగా ఇప్పటివరకు రూ.50 కోట్ల మేర ఖర్చు చేశారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద మూడు ముంపు గ్రామాలు ఉండగా ఇక్కడ 344 ఎకరాల మేర భూసేకరణ చేశారు. మొత్తంగా 2,640 మంది నిర్వాసితులకుగానూ 1,824 మందికి మాత్రమే పట్టాల పంపిణీ పూర్తయింది. ఇక్కడ గత ఏడాది చివరి నాటికే లెవలింగ్, రోడ్, వాటర్, విద్యుత్ సదుపాయాలు సమకూర్చాల్సి ఉన్నా అది పూర్తి కాలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement