
సనత్‌నగర్: అతని వయస్సు 26...చేసిన నేరాలు 29...వృత్తి కారుడ్రైవర్, కుక్ అయినప్పటికీ విలాసవంతమైన జీవితం కోసం నేరాల బాట పట్టాడు. దొంగతనం, చైన్‌స్నాచింగ్, దోపిడీ ఏదైనా సరే... రెక్కీ నిర్వహించడం, పని పూర్తి చేసుకుని ఎక్కడా ఆగకుండా బీదర్‌కు వెళ్ళిపోతాడు. సొత్తును విక్రయించి జల్సా చేస్తాడు. 29 నేరాలకు పాల్పడిన ఘరానా దొంగను సనత్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి అతడి నుంచి 52 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం బాలానగర్ డీసీపీ సాయిశేఖర్ వివరాలు వెల్లడించారు. గత ఏడాది జనవరి 26న భరత్‌నగర్ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయురాలు శైలజ వీవీనగర్ ప్రాంతంలో ఇంటికి వెళ్తుండగా బైక్‌పై ఎదురుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని 3.5 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సనత్‌నగర్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో నిందితుడిగా బీదర్ జిల్లా, సైదాపూర్‌వాడీకి చెందిన భల్కే నరేష్ అలియాస్ కిట్టు అలియాస్ ఇమ్రాన్‌ను అక్టోబర్ 28న అరెస్టు చేసి అతడి నుంచి 50 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నరేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రధాన నిందితుడు బల్కి తాలూకా చించోలి గ్రామానికి చెందిన డెబ్బె విజయ్‌కుమార్ అలియాస్ ఒమర్ అలియాస్ విజయ్‌కుమార్ చౌదరిగా గుర్తించి అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు. బుధవారం బీదర్ నుంచి హైదరాబాద్ వస్తున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జల్సాల కోసమే.. కారు డ్రైవర్, కుక్‌గా పనిచేసే విజయ్‌కుమార్ నగరంలోని కిషన్‌బాగ్ కొండారెడ్డిగూడలో ఉండేవాడు. ఇద్దరిని పెళ్లి చేసుకున్న విజయ్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. డబ్బుల కోసం దొంగతనాలు, దోపిడీలు, చైన్‌స్నాచింగ్‌లను ఎంచుకున్నాడు. బీదర్‌జిల్లాకు చెందిన స్నేహితులు భల్కే నరేష్, డెబ్బె అర్జున్ అలియాస్ చిన్నా, షేక్ అఫ్రోజ్‌తో కలిసి ముందుగా రెక్కీ నిర్వహిస్తాడు. జనసంచారం లేని ప్రాంతాలను ఎంచుకుని ఒంటరి వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తాడు. బైక్‌పై ఎదురుగా వచ్చి మహిళలను కంగారుపెట్టి మెడలో గొలుసులు లాక్కెళ్లేవాడు. నేరం చేసిన వెంటనే నేరుగా తన స్వస్థలానికి వెళ్లిపోతాడు. గతంలో కర్ణాటకతో పాటు నగరంలోని వివిధ పోలీస్టేషన్ల పరిధుల్లో 18 నేరాలకు పాల్పడి జైలుకు వెళ్ళి వచ్చాడు. ఇతనిపై రాంగోపాల్‌పేట పీఎస్‌లో పీడియాక్ట్ నమోదైంది. జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత.
గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు మరో 11 నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో 8, మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2, సనత్‌నగర్ పరిధిలో ఒక కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. బీదర్‌లో ఖరీదైన ఇంట్లో ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 11 కేసులకు సంబంధించి 400 గ్రాముల బంగారు ఆభరణాలు తస్కరించగా, బుధవారం అతని వద్ద నుంచి 52 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగతా సొత్తును కూడా రికవరీ చేయనున్నట్లు డీసీపీ తెలిపారు. కేసును చేధించిన ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, క్రైమ్ ఎస్‌ఐ కృష్ణను డీసీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment