భువనగిరి: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం అభివృద్ధికి చేపట్టిన 2 వేల ఎకరాల భూసేకరణ కార్యక్రమం పూర్తయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టను వాటికన్ సిటీ తరహాలో తెలంగాణలో అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం నాలుగుసార్లు యాదగిరిగుట్టకు వచ్చి అభివృద్ధికి సంబంధించిన కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే సేకరించిన భూమిని యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిసంస్థకు అప్పగించారు. మరో వెయ్యి ఎకరాలు సేకరించడానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలో గత సోమవారం హైదరాబాద్‌లోని యాదగిరిగుట్ట అభివృద్ధి సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూసేకరణకు అవసరమైన నిధులు సమకూర్చడంతోపాటు, భూసేకరణకు ఏమైన ఇబ్బందులు ఉన్నాయా అని చర్చించారు.
తొలిసారిగా అక్టోబర్ 17, డిసెంబర్ 17, ఫిబ్రవరి 25, 27న గుట్ట స్వామిని దర్శించుకున్న కేసీఆర్ ఆరోజే రెండు వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నాలుగు రోజులుగా జేసీ సత్యనారాయణ అధ్వర్యంలో అధికారులు ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించాల్సిన భూమికి సంబంధించిన వివరాల సమగ్ర సేకరణలో ఉన్నారు. మొత్తంగా సుమారు 2100 ఎకరాల భూమిని అధికారులు గతంలోనే సేకరించాలని నిర్ణయించారు.
ఇందులో దేవాలయ భూములు 166.07 ఎకరాలు, సీలింగ్ భూమి 327.37 ఎకరాలు, చెరువు శిఖం 174.28 ఎకరాలు, ఫారెస్ట్ భూములు 380 ఎకరాలు, రైతులు, ప్రవేట్ వ్యక్తుల నుంచి 1001 ఎకరాల భూమితో కలిపి 2100 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు సర్వేనంబర్ల ఆధారంగా భూముల వివరాలను సేకరించి వాటికి సంబంధించిన మ్యాప్‌ను రూపొందించారు. భూములకు సంబందించిన సమగ్ర నివేదికను యాదగిరిగుట్ట దేవస్థాన ం అభివృద్ధి సంస్థకు అప్పగించారు. కాగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
ఇక్కడ భూములు ఇలా ఉన్నాయి..
యాదగిరిపల్లి, గుండ్లపల్లి, దత్తాయపల్లి, సైదాపురంతోపాటు, భువనగిరి మండలం రాయగిరిలో భూములను తీసుకోవాలని నిర్ణయించారు. యాదగిరిపల్లిలో 147.07 ఎకరాల దేవాలయం భూమి, 121.02 ఎకరాల ప్రభుత్వ భూమి, 35.20 ఎకరాల చెరువు శిఖం ఉంది. గుండ్లపల్లిలో 47.26 ఎకరాల సీలింగ్ భూమి, దత్తాయపల్లిలో 5 ఎకరాల దేవాలయ భూమి, 2.36 ఎకరాల సీలింగ్ భూమి, సైదాపురంలో 14 ఎకరాల దేవాలయ భూమి, 22.19 ఎకరాల సీ లింగ్ భూమి, 133.36 ఎకరాల ప్రభుత్వ భూమి, 27.30 ఎకరాల చెరువు శిఖం, రాయగిరిలో 72.39 ఎకరాల ప్రభుత్వ భూమి, 111.18 ఎకరాల చెరువు శిఖం, 380 ఎకరాల పారెస్ట్ భూమి,
ఈ గ్రామాల్లో ఇలా తీసుకుంటారు..
దేవస్థానం అభివృద్ధి కోసం అధికారులు గుర్తించిన దేవాలయ,సీలింగ్, ప్రభుత్వ, చెరువు శిఖం, ఆటవీ శాఖ భూములకు అదనంగా అవసరమైన ప్రైవేట్ భూములను గుర్తించారు. రైతుల వద్దనుంచి ఈ భూములను భూసేకర ణ ద్వారా తీసుకోనున్నారు. ఇందులో భాగంగా యాదగిరిపల్లిలో 357.24 ఎకరాలు, గుండ్లపల్లిలో 144.15 ఎకరాలు, దత్తాయపల్లిలో 122.16 ఎకరాలు, సైదాపురంలో 311.37 ఎకరాలు, రాయగిరిలో 81.11 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. దీంతో అధికారులు భూసేకరణకు సంబంధించి తొలివిడత కార్యక్రమాన్ని పూర్తి చేశారు. భూములు ఎక్కడ, ఏమేరకు సేకరించాలన్న నిర్ణయం కావడంతో భూసేకరణకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
రియల్టర్ల గుండెల్లో పరుగులుపెడుతున్న రైళ్లు..
యాదగిరిగుట్ట అభివృద్ధి సంస్థకోసం గుట్ట పరిసరాల చుట్టూ రైతులు, రియల్లర్‌ల వెంచర్ల నుంచి భూములను సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే అధికారులు భూసేకరణ చేసే గ్రామాల్లో పదుల సంఖ్యలో వెంచర్లు ఉన్నాయి. వాటిల్లో వందలాది మందికి రియల్టర్లు ఓపెన్‌ప్లాట్లను అమ్మారు. పలు వెంచర్లకు ఎలాంటి అనుమతులూ లేవు, కనీసం నాలా కన్వర్షన్ కూడా లేవు. దీంతో హైదరాబాద్‌తో పాటు ఇక్కడి ప్రాంతం వారు కొన్న ప్లాట్ల పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు,.
నేడు గుట్టకు సీఎం
భువనగిరి/యాదగిరికొండ : చినజియర్ స్వామితో కలిసి సీఎం కేసీఆర్ గురువారం ఉదయం యాదగిరిగుట్టకు రానున్నారు. గత నెల 27న గుట్టకు వచ్చిన సీఎం వారం రోజుల్లో చినజియర్ స్వామితో కలిసి వచ్చి ఆలయంలో చేపట్టే అభివృద్ధి పనులను పరిశీలిస్తామని, ఆయన సూచనలు తీసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం మరోమారు యాదగిరిగుట్టకు వస్తున్నారు. యాదగిరిగుట్ట క్షేత్రాన్ని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ ఇప్పటికే నాలుగుసార్లు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి స్వయంగా ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే గత నెల 25న, 27న రెండుసార్లు గుట్టకు వచ్చిన సీఎం కొండపై కలియదిరిగి మాస్టర్‌ప్లాన్‌కు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ప్రధాన ఆలయానికి ఎలాంటి మార్పులూ లేకుండా ఆగమ శాస్త్రం, వాస్తు ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
సీఎం షెడ్యూల్..
ఉదయం 11 గంటలకు జియర్‌స్వామితో కలిసి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలు దేరుతారు. 11.30 యాదగిరిగుట్టకు చేరుకుంటారు. ఒంటి గంటవరకు అక్కడ ఆలయ పరిసరాలను, ప్రధాన గర్భాలయంలో ఆయన జియర్‌స్వామితో కలిసి చర్చిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్ వెళ్తారు.
సీఎం రాకకు పకడ్బందీ ఏర్పాట్లు
త్రిదండి చిన జియర్‌స్వామితో సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు చేశారు. దేవస్థానం పరిసరాలను శుభ్రం చేశారు. ఘాట్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లను, చెత్తాచెదారాన్ని తొలగించారు. కొండపైకి వస్తున్న భక్తుల వాహనాలను ఆపి బైక్‌లను, కార్లలో డాగ్‌స్క్వాడ్‌తో విస్త్రృత తనిఖీలు చేపడుతున్నారు. బ్రహ్మోత్సవాల సందడి అంతా తొలగించారు.సీఎం రాకను దృష్టిలో ఉంచుకుని స్వామి, అమ్మవార్ల దర్శనానికి రానున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
వేగిరం.. పూర్తయిన గుట్ట భూసేకరణ సర్వే
Published Thu, Mar 5 2015 2:27 AM | Last Updated on Wed, Jul 25 2018 2:52 PM
Advertisement
Advertisement