సగం ధరకే కార్పొరేట్ వైద్యం
► ఉద్యోగులు, జర్నలిస్టుల వైద్యసేవలపై ప్రభుత్వం కొత్త ప్రతిపాదన
► అంగీకరించిన కార్పొరేట్ ఆసుపత్రులు!
► వచ్చే నెలలో జర్నలిస్టులందరికీ ఆరోగ్య కార్డులు: మంత్రి లక్ష్మారెడ్డి
► హైదరాబాద్‌లో 6 చోట్ల, పాత జిల్లా కేంద్రాల్లో రిఫరల్ ఆసుపత్రులు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడనుంది. రాష్ట్రంలోని కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులన్నింట్లోనూ ఉద్యోగులు, జర్నలిస్టులకు సగం ధరకే వైద్య చికిత్సలు అందుబాటులోకి తీసుకురావాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. సాధారణంగా వివిధ వైద్య చికిత్సలకు ఆయా ఆసుపత్రులు వసూలు చేసే సొమ్ములో సగం చెల్లించేలా అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రస్తుత ప్యాకేజీ సరిపోవడం లేదని, దాన్ని 60 శాతం వరకు పెంచాలని కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వాన్ని కోరాయి. ప్యాకేజీ పెంపు, ఉచిత ఓపీ సేవల విషయంలోనే ఏడాదిన్నరగా సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా ఆసుపత్రులు వివిధ వైద్య సేవలకు వసూలు చేసే సొమ్ములో సగమే చెల్లిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఇలా చేసినా ప్రస్తుత ప్యాకేజీని 30 నుంచి 40 శాతం వరకు పెంచినట్లే అవుతుందని అంచనా. సరికొత్త ప్రతిపాదనను కార్పొరేట్ యాజమాన్యాలు కూడా అంగీకరించాయని అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి శనివారం సాయంత్రం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ మనోహర్, ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం(ఈజేహెచ్‌ఎస్) సీఈవో డాక్టర్ పద్మ తదితర ఉన్నతాధికారులతో సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల రెండో తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో ప్రత్యేకంగా సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం ఐదారు తేదీల నుంచి ఈ పథకాన్ని సమగ్రంగా అమలు చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు కూడా అన్ని వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. వచ్చే నెలాఖరులోగా అందరికీ నగదు రహిత ఆరోగ్య కార్డులు అందజేస్తామన్నారు.
హైదరాబాద్‌లో ఆరు చోట్ల, పాత జిల్లా కేంద్రాలన్నింటా రిఫరల్ ఆసుపత్రులు
ఇక నుంచి ఉద్యోగులు, జర్నలిస్టులు నేరుగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లే అవకాశం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే రిఫరల్ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకున్నాక అవసరమని డాక్టర్లు రిఫర్ చేస్తేనే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుతాయి. హైదరాబాద్‌లో ఖైరతాబాద్, కూకట్‌పల్లి, వనస్థలిపురం ప్రాంతాల్లో... గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రుల్లో ఉద్యోగుల రిఫరల్ కేంద్రాలు నెలకొల్పుతారు. పాత జిల్లా కేంద్రాలన్నింటిలోనూ ఈ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తారు. వీటిలో అత్యాధునిక డయాగ్నస్టిక్ పరికరాలను అందుబాటులో ఉంచుతామని మంత్రి తెలిపారు.
రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య అత్యవసర వైద్యం చేయించుకోవాల్సి వస్తే నేరుగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లడానికి అవకాశమిస్తారు. ఏ సమయంలోనైనా గుండెపోటు వంటివి వస్తే కూడా కార్పొరేట్ లేదా ఇతర నెట్‌వర్క్ ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా వెళ్లవచ్చు. రిఫరల్ ఆసుపత్రుల్లో బ్రాండెడ్ మందులనే సరఫరా చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబీకులకు ఏడాదికోసారి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎగ్జిక్యూటివ్ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని విడతల వారీగా అమలు చేస్తామని ైవె ద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.