సాక్షి, న్యూఢిల్లీ : విశిష్ట గుర్తింపు సంఖ్యతో దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా క్రెడిట్ కార్డు తరహా మెడికల్ కార్డులను ఉద్యోగులు, పెన్షనర్లకు జారీ చేయాలని రైల్వేలు నిర్ణయించాయి. ప్రస్తుతం జోనల్ రైల్వేలు రేషన్ కార్డులను తలపించేలా బుక్‌లెట్స్ రూపంలో మెడికల్ కార్డులను ఉద్యోగులకు అందచేస్తున్నాయి. వీటి స్ధానంలో ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు విశిష్ట గుర్తింపు సంఖ్యతో వైద్య గుర్తింపు కార్డును జారీ చేయాలని రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే సిబ్బంది, ఉద్యోగులందరికీ వైద్య గుర్తింపు కార్డులను ఒకే గొడుగుకిందకు తీసకువచ్చేలా ఉద్యోగులు, వారిపై ఆధారపడినవారందరికీ మెడికల్ కార్డులు జారీ చేయాలని ఈ ఉత్తర్వుల్లో రైల్వే బోర్డు పేర్కొంది.
ప్లాస్టిక్‌తో రూపొందించే ఈ కార్డులు బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డుల తరహాలో ఉంటాయని ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రతి కార్డుపైనా కలర్ స్ర్టిప్ ఉంటుంది. దీనిపై కార్డుదారుని ప్రస్తుత స్టేటస్ ప్రస్తావిస్తూ సర్వీస్‌లో ఉన్నారా, పదవీవిరమణ చేశారా అనే వివరాలు పొందుపరుస్తారు. 15 ఏళ్ల పైబడిన లబ్ధిదారులకు జారీ అయ్యే ఈ కార్డులు ఐదేళ్ల గడువు వరకూ వర్తిస్తాయని ఆ తర్వాత రెన్యూవల్ చేయించుకోవాలని ఉత్తర్వులు పేర్కొన్నాయి.ప్రస్తుతం రైల్వేల్లో 13 లక్షల మంది ఉద్యోగులుండగా, దాదాపు అదే సంఖ్యలో పెన్షనర్లు వారిపై ఆధారపడిన వారు ఈ మెడికల్ కార్డులను ఉపయోగించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment